టమాటా, ఉల్లి ధరల  సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నాటికి మార్కెట్లో టమాటా నిల్వలు చేరుకుంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దిగుబడి పెరిగి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. నవంబర్ 25 నాటికి కిలో టమాట సగటు ధర 67 రూపాయలు గా ఉండేది. గత సంవత్సరంతో పోలిస్తే 63 శాతం పెరిగింది. సెప్టెంబర్లో పంజాబ్, యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బ తినడం వల్ల దిగుబడి ఆలస్యం అయింది. తమిళనాడు, ఏపీ,తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో పాటు రవాణా పై కూడా ప్రభావం పడి టమాట ధరలు ఆకాశాన్నంటాయి.

 ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి  69 లక్షల మెట్రిక్ టన్నుల టమాటా దిగుబడి అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 70.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండగా, ఈసారి టమాటా దిగుబడి బాగా తగ్గిపోయింది. ఇక ఇప్పటికే ఖరీఫ్ సీజన్లోఉల్లి మార్కెట్ లోకి చేరుకుంటోంది. దేశవ్యాప్తంగా నవంబర్ నాటికి సగటు ఉల్లి ధర 39 రూ.గా ఉండేది. గత ఏడాదితో పోలిస్తే ఉల్లి ధర 32 శాతం తగ్గింది. 2019-2020 కంటే ప్రస్తుత ఉల్లి ధర తక్కువగానే ఉంది. అలాగే ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం వద్ద ఉన్న 2.08 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వల నుంచి విడుదల చేసింది. రవాణా ఖర్చు తో కలిపి కిలో 26 రూపాయలతో సరఫరా చేసింది కేంద్రం. ధరల నియంత్రణ పథకం కింద  రాష్ట్రాలకు50-50 నిష్పత్తి లోనూ, ఈశాన్య రాష్ట్రాలకు 75 -25 నిష్పత్తి లోనూ వడ్డీరహిత అడ్వాన్సుల్ని అందించింది కేంద్రం. ఈ సందర్భంగా ఆహార వస్తువుల ధరలను నియంత్రించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఏపీ,తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు 164.15 కోట్ల కేంద్ర వాటా విడుదల చేసింది. నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు రాష్ట్రాలు కూడా ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: