అకాల వాన‌లు జీవితాల‌ను అత‌లాకుత‌లం చేస్తాయి. అసంద‌ర్భ ప్రేలాప‌న‌లు ఉన్న చోట ఉండ‌నీయవు. పరువూ మ‌ర్యాద అన్న‌వి లేకుండా చేస్తాయి. పంట‌లు పోయి ఇళ్లు పోయి ఏడుస్తున్న వారికి రాజ‌కీయాలు ఓదార్పు ఇవ్వ‌వు. చేయాల‌నుకున్నంత సాయం ఆ పార్టీనో ఈ పార్టీనో చేస్తే మేలు. తెలుగు దేశం పార్టీ త‌న త‌ర‌ఫు సాయం ప్ర‌క‌టించి ఉదార‌తనే చాటుకుంది కానీ ఇప్ప‌టికీ రాజకీయ సంబంధ వ్యాఖ్య‌లు మాత్రం మానుకోవ‌డం లేదు. దీంతో టీడీపీ చేసిన సాయం క‌న్నా టీడీపీ చేయాల‌నుకుంటున్న రాజకీయ‌మే పెద్ద ప్ర‌భావం చూపుతోంది. దీంతో  వైసీపీ కూడా అదే స్థాయిలో తిరుగుబాటు చేస్తోంది. పోనీ ఇప్ప‌టికైనా బాధితుల‌కు విప‌క్షం, స్వ‌ప‌క్షం అన్న తేడా లేకుండా సాయం అందితే చాలు. పాపం తిండి లేక అల్లాడుతున్న వారికి తిరుప‌తి వెంక‌న్న  సాక్షిగా ప‌స్తులుంటున్న వారికి, ల‌క్ష కుటుంబాలు రోడ్డున ప‌డితే ప‌ట్టించుకునే దిక్కులేక దేవుడ్ని ప్రార్థిస్తున్న వారికి నాయ‌కులారా ఇప్ప‌డు మీరే అండ కావాలి. మీరే మంచి మ‌ద్ద‌తు ఇవ్వాలి. మీరే ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చి క‌ష్ట‌కాలంలో పిడికెడు మెతుకులు ఇచ్చి మాన‌వ‌త్వం చాటుకోవాలి. కానీ ఇవేవీ చేయ‌కుండా వ‌ర‌ద పేరిట బుర‌ద రాజ‌కీయం చేయ‌డం తగ‌దు గాక త‌గ‌దు.

ఆంధ్రావ‌నిలో ఎటు చూసినా విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు రాజ్యం ఏలుతున్నాయి. ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు వీటి స్థాయి మోతాదు దాటి పోయింది. దీంతో ఒక‌ప్పుడు క‌న్నా ఇప్పుడు రాజ‌కీయాలు డిగ్నిఫైడ్ మ్యాన‌ర్ లో లేవ‌ని, అస‌లు ఎందుకు ఉండాల‌ని ప‌రిస్థితులు, గ్ర‌హ స్థితుల రీత్యా రాజ‌కీయం ఉండాల‌ని కోరుకోవడం త‌ప్పేమీ కాద‌ని అంటున్నారు కొంద‌రు. అవును ఏదీ త‌ప్పు కాదు తిట్టుకోవ‌డం, స్థాయి మ‌రిచి తిట్టుకోవ‌డం, మ‌హిళ‌ల‌ను కించ‌పరుస్తూ తిట్టుకోవ‌డం అన్న‌వి ఇప్పుడే కాదండి గ‌తంలో కూడా జ‌రిగాయి. అయితే అవి ఆ రోజుకు ఆగిపోయినా ఇప్ప‌టిలా చిలువ‌లు ప‌లువలు చేసేందుకు మీడియా లేదు. సోష‌ల్ మీడియా అంత క‌న్నా లేదు. దీంతో కొన్ని వ్యాఖ్య‌లు వ్యాప్తి చెంద‌క‌మునుపో, ప్ర‌చారానికి నోచుకోక మునుపో ఏదో ఒక‌టి జ‌రిగి ఆగిపోయేవి. కొన్ని సార్లు రాజ‌కీయ నాయ‌కులు హుందాత‌నంతో క్ష‌మాప‌ణ‌లు చెప్పి సంబంధిత వివాదాల‌ను ముగించేవారు.




 కానీ ఇప్పుడు అలా కాదు వ‌ర‌ద‌లు వ‌చ్చినా తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక‌పోయినా ఏం జరిగినా బాధిత ప‌రామ‌ర్శ పేరిట న‌డుస్తోంది రాజ‌కీయ‌మే! ఇవ‌న్నీ ఇప్ప‌టికిప్పుడు ఆగ‌డం సాధ్యం కాని ప‌ని! ఆగ‌డం కాదు ఆప‌డం కూడా సాధ్యం కాని ప‌ని! ఎందుకంటే ఎవ‌రి వ్య‌క్తిగ‌త అజెండా వారిది. అందుకు పార్టీ లైన్ తో సంబంధం లేదు. ఎవ‌రి సొంత వ్యాప‌కం వారిది. అందుకు పార్టీ అధినేత‌తో ప‌నేలేదు. తిట్టాక భ‌రించ‌డం ఇప్పుడు పార్టీ నాయ‌కుల‌కు అల‌వాటుగా మారింది. తిట్టాక ఏ వివాదం వ‌చ్చినా భ‌రించాల్సి రావ‌డం ఇప్పుడున్న పార్టీ అధినాయ‌కుల‌కు ఓ నిత్య‌కృత్యం అవుతోంది. అంతేకానీ స్థాయి విడిచి లేదా స్థాయి మ‌రిచి రాజ‌కీయం చేయొద్ద‌ని ఎందుకు చెప్ప‌డం లేదు అన్న‌ది అర్థం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: