ఇద్దరి గురీ ఒక్కటే, ఇరువురి లక్ష్యం ఒక్కటే. కలివిడిగా కాకుండా విడివిడిగా పరుగులు పెడుతున్నారు. కానీ వారు ఎదుర్కోబోయేది సామాన్య లీడర్ ను కాదు, మాస్ నాయకున్ని. నేషనల్ పాలిటిక్స్ డైనమిక్ మారుతున్నాయి. రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన పాపులర్ సీఎంలు ఇప్పుడు ఏకంగా ఢిల్లీ సింహాసనంపై మనసు పడుతున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగింది, మనమెందుకు కాకూడదన్న కోణంలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. ఢిల్లీకే పరిమితమైపోతుందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ పై గురి పెట్టింది. ఇప్పటికే పంజాబ్లో రాజకీయ గందరగోళం నెలకొని ఉండడంతో ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే మహిళలు, పేదలు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు అదిరిపోయే పథకాలు ప్రకటించారు.

 పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు  1000 రూ. అందివ్వనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పంజాబీ మీదే కేజ్రీవాల్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నా యూపీ, గుజరాత్, గోవాల్లోనూ చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా అనేక రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి ఆమ్ ఆద్మీని జాతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు కేజ్రీవాల్. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ  అధినేత మమతా బెనర్జీ కూడా పార్టీ విస్తరణపై  ఎక్కువ దృష్టి పెట్టారు . గోవా, యూపీలో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.  అలాగే నార్త్ ఈస్ట్ లోను టీఎంసీని విస్తరించాలని ప్రణాళికలు వేస్తున్నారు. మేఘాలయలో కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చారు దీదీ. మమతా కూడా పీకే డైరెక్షన్లోనే అనేక రాష్ట్రాల్లో పార్టీని విస్తరించుకుంటూ మోడీని ఢీకొట్టే లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు తపిస్తున్నారు. అటు అరవింద్ కేజ్రీవాల్ ఇటు మమతా బెనర్జీ ఈ ఇద్దరు ప్రాంతీయ పార్టీల లీడర్లే. ఇప్పుడు జాతీయ స్థాయిలో చెలరేగిపోయెందుకు రెడీ అవుతున్నారు. ఇద్దరికీ ప్రధానమంత్రి కలలున్నాయి. సుప్రీం సింహాసనం పై మోజుంది కానీ రెండు జాతీయ పార్టీలు కాదు. ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితం, అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటే తప్ప మోడీని ఓడించే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ కాంగ్రెస్ తో చేయ్యి కలపకుండా మోడీ ని గద్దె దించడం కష్టం అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. మొత్తానికి మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు పదునేక్కుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీలు కొత్త శక్తులుగా అవతరించే అవకాశం ఉంది. కానీ సౌత్ లో మాత్రం పాగా వేయలేరు. ప్రధానమంత్రి పీఠం అధిరోహించగల సంఖ్యాబలాన్ని ఒంటరిగా సాధించలేరు. మరి మోడీని ఎదుర్కొనే లీడర్ గా జనం ఎవరిని గుర్తిస్తారు. కేజ్రివాల్ నా..? మమతాబెనర్జీనా..? ఇద్దరూ కాదంటే మరో నేతనా..?

మరింత సమాచారం తెలుసుకోండి: