ఏపీలో జగన్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. తాజాగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో పాటు కాంగ్రెస్ కు సమాన దూరంలో ఉంటామని ప్రకటించారు. ఇకపై తమ నిర్ణయాలు .. అడుగులు అన్ని రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఉంటాయని చెప్పేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై తమ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంటులో గట్టిగా పోరాడాలని కూడా జగన్ పిలుపునిచ్చారు. ఇక త్వ‌ర‌లోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో జగన్ అడుగులు ఎటు వైపు ఉంటాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉప‌ రాష్ట్రపతిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెంకయ్యనాయుడు ఉన్నారు. ఆయన ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ఖరారు చేస్తారా లేదా ? అన్నది ఇంకా ఖరారు కాలేదు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్న ప్రచారం అయితే ఉంది. ఒకవేళ వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటే ఆయనకు జగన్ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి అయినా.. వెంక‌య్య చంద్రబాబు మనిషి అన్న టాక్ ఉన్నా కూడా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో లేరు. ఒకవేళ జగన్ వెంకయ్యనాయుడు కు మద్దతు ఇవ్వకపోతే అది తెలుగు వ్యక్తికి జగన్ మద్దతు ఇవ్వలేదన్న వ్య‌తిరేక సంకేతం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దాంతో జగన్ వెంకయ్య విషయంలో పెద్దగా అభ్యంత‌రం పెట్ట‌ర‌నే అంటున్నారు.

అయితే రాష్ట్రపతి రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, అసంతృప్తి నేత గులాం నబీ ఆజాద్ పేరు కూడా వినిపిస్తోంది. గులాం నబీ ఆజాద్ మైనార్టీ వర్గానికి చెందిన నేత అయినా కాంగ్రెస్ అప్పుడు రాష్ట్ర విభజన చేసే సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పైగా వైఎస్ మరణాంతరం గులాం నబీ ఆజాద్ కూడా జగన్‌ను బాగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి.

అందుకే ఆయన రాష్ట్రపతి అభ్యర్థి అయితే మద్దతు ఇవ్వకూడదని జ‌గ‌న్ డిసైడ్ అయ్యార‌ని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వెంకయ్య నాయుడు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి అయితే పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణా కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే జగన్ ఆయన విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: