అమరావతినే రాజధానిగా ఉంచాలని అక్కడి రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమం రోజు రోజుకూ పుంజుకున్నట్లు కనిపిస్తున్నా... అది నాణేనికి ఒక వైపు అన్నట్లు గానే ఉంది. గతంలో పత్రికల్లో మొదటి పేజీలో చోటు చేసుకన్న వార్తలు, ప్రస్తుతం  ఏదో ఒక మూల కూడా వెతికినా కనిపించడం లేదు. ఆ సంగతి  కాసేపు అలా  పక్కన ఉంచుదాం.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో  అమరావతి రైతుల తాజా స్థితి ఏమిటన్నది ప్రస్తుతం అందరినీ కుదుపివేస్తున్న ప్రశ్న.  నిరసన కార్యక్రమాల్లో భాగంగా వారు చేస్తున్న న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్ర లో  వారు  తమ మార్గ మధ్యలో ఉన్న రైతులను కానీ, ప్రజలను కానీ జాగృతం చేయలేక పోయారన్నది వారి మాట్లల్లోనే తెటతెల్లమవుతోంది. ఈ లోగా  శాసన సమావేశాల్లో  రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లను వెనక్కి తీసుకోవడం, మరలా తిరిగి ప్రవేశపడతాని ప్రకటించడం అంతా కూడా ఒకే రోజు జరిగి పోయాయి. అదే రోజు  అమరావతి రైతులకు సంతోషం. దుఃఖం కూడా వెంట వెంటనే వచ్చాయి.  
పాలకులు తమ గోడు వినక పోయినా, తమ బాధలను అర్థం చేసుకోక పొయినా వారికి దింపుడు కళ్లం అశ లాగా ఓ చిన్న ఆశ వారిలో ఉండేది. అదే న్యాయస్థానం తమను అర్థం చేసుకుంటుంది అని వారు భావించారు. ప్రస్తుతం ఆ అవకాశాలు సన్నగిల్లాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. దాని స్థానంలో కొత్త చట్టాలను తీసుకు వస్తానని ప్రభుత్వం పేర్కోంది.  నూతన చట్టంలో ఏమి ఉంటుందో ప్రస్తుతం ఎవరికీ తెలీదు.  కొత్త చట్టం వస్తే, అది తమకు అనుకూలంగా లేని పక్షంలో మరలా అమరావతి రైతులు న్యాయపోరాటం చేయాల్సి వస్తుంది. మరో దఫా న్యాయస్థానం తలుపు తట్టడం, న్యాయం చేయమని అర్థించడం అంత సులువైన పని కాదు. కొత్త చట్టాలను సవాల్ చేసిన పక్షంలో తమ వాదనలను కూడా మరింత పటిష్టంగా వినిపించాల్సి వస్తుంది. భూ సేకరణ సమయంలో నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను  ప్రస్తుత పాలకులు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే అవకాశం లేదు.   వారికి పరిహారం  చెల్లింపులు కూడా పూర్తి స్థాయిలో జరిగే అవకాశం  కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రస్తుతం నిధుల కొరతను ఎదుర్కోంటున్నదన్న విషయం అందరికీ ఎరుకే. అదీ కాక రాజధానిగా  అమరావతినే కొనసాగించాలని అక్కడి రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా అమరావతి రాజధానిగా ఉంటుందని పేర్కోంటూ పరిపాలనా వికేంద్రీకరణను ముందుకు పెడుతోంది. దీంతో రానున్న రోజుల్లు అమరావతి రైతులు గడ్డు కాలం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: