ఉండవల్లి అరుణ్ కుమార్. తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి పరిచయం అక్కరలేని పేరు. ఉండవల్లి రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా ఒకపుడు ఉండేవారు. విభజన తరువాత ఆయన కాంగ్రెస్ కి రాజకీయాలకు రాం రాం అనేశారు.

అయితే ఉండవల్లి రాజకీయ విశ్లేషకుడిగా, విమర్శకుడిగా తన బాధ్యతలను ఈ రోజుకీ నిర్వహిస్తున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయరంతే.  అంతే తప్ప రాజకీయాలు మాట్లాడుతాను అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా జగన్ సర్కార్ మీద మొదట సుతి మెత్తగా మొదలుపెట్టి ఇపుడు ఏకంగా ఘాటు కామెంట్స్ చేస్తున్నారు ఉండవల్లి. ఆయన కామెంట్స్ బాగా పదును తేరుతున్నాయి. ఒక విధంగా విపక్షాలు  సైతం టార్గెట్ చేయనంతగా ఉండవల్లి జగన్ మీద విరుచుకుపడుతున్నారు.

ఈ విషయంలో ఉండవల్లికి వేరే రాజకీయాలు లేవని ఎవరైనా అంటారు. ఆయనకు ఎలాంటి పదవులు అవసరం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేశారు. దాని వెనక కారణం తెలిసిందే. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం వల్లనే ఆయన ఇలా చేశారు. అంటే ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు అతి ముఖ్యమని అంతా ఒప్పుకుంటారు. ఇక వైఎస్సార్ సీఎం గా ఉన్న కాలంలో ఉండవల్లి పోలవరం ప్రాజెక్ట్ కి అవసరం అయిన అన్ని అనుమతులను తెచ్చారు. ఇపుడు ఆ ప్రాజెక్ట్ పెద్దగా ముందుకు సాగడంలేదు.

మరో వైపు ఏపీ అప్పుల కుప్పగా మారుతోంది. జగన్ సంక్షేమ పధకాలతో ముందుకు సాగుతున్నారు. దాంతో ఉండవల్లి తాను అనాల్సినవి అన్నీ అనేశారు. ప్రభుత్వ పనితీరు దారుణమని అన్నారు. జగన్ రెండున్నరేళ్ల పాలన‌కు మార్కులేసి మరీ  ఫెయిల్ చేసి పారేశారు. మరి ఇది నిజంగా వైసీపీ వారికి, జగన్ అభిమానులకు బాధించే విషయమే. అయితే వారు అనేది ఏంటి అంటే రెండేళ్లుగా ఆదాయాలు ఎక్కడా లేవు. కరోనా వచ్చి మొత్తం సీన్ రివర్స్ చేసింది. చంద్రబాబు అయితే లక్షల అప్పు తెచ్చి పెట్టారు. అవన్నీ తమకు వారసత్వంగా వచ్చాయని అంటున్నారు. మొత్తానికి అన్నీ తెలిసి ఉండవల్లి ఇలా అంటున్నారని వారు బాధపడుతున్నారు. మొత్తానికి ఉండవల్లి అయితే ఏపీకి భవిష్యత్తు లేకుండా జగన్ చేస్తున్నారు అంటూ నిప్పులే చెరిగారు. అసలే అన్ని రకాలుగా దెబ్బ తిని ఉన్న తెలుగుదేశానికి ఆయన చక్కని ఆయుధాన్ని ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: