ధ‌ర్నాచౌక్‌లో  కేసీఆర్ చేసిన ధ‌ర్నా రైతుల కోసం చేసిన‌ది కాద‌ని.. కేసీఆర్ కుమారుడు సీఎం కావాల‌నే చేసార‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం నుంచి ప్ర‌జ‌ల‌ను దృష్టి మ‌ళ్లీంచేందుకు ధాన్యం వివాద‌మును తెర‌పైకి తీసుకొచ్చార‌ని విమ‌ర్శ‌లు చేసారు. రాష్ట్ర ప్ర‌భుత్వంతో కేంద్ర ప్ర‌భుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు కిష‌న్‌రెడ్డి.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంత నిర్బంధం పెడితే ప్ర‌జ‌లు అంతా తిరుగుబాటు చేస్తార‌ని.. కేసీఆర్‌పై ధ్వ‌జ‌మెత్తారు కేంద్ర‌మంత్రి. దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు, జీహెచ్ఎంసీ ఫ‌లితాలలోనే ఇది నిరూపిత‌మైంద‌ని వెల్ల‌డించారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాన్ని తారు మారు చేయాల‌ని టీఆర్ఎస్ చూసింద‌ని ఆరోపించారు కిష‌న్‌రెడ్డి. హుజూరాబాద్ లో  ద‌ళితబంధును ఆపేందుకు బీజేపీ ఈసీకి లేఖ రాసింద‌ని త‌ప్పుడు ప్రచారం చేసార‌ని మండిప‌డ్డారు. హుజూరాబాద్ ఫ‌లితం నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు ధాన్యం వివాదాన్ని తెర‌పైకి తీసుకొచ్చార‌ని  విమ‌ర్శ‌లు గుప్పించారు.

దేశంలో బాయిల్డ్ రైస్ తినే ప్ర‌జ‌ల సంఖ్య త‌గ్గిపోయింద‌ని పేర్కొన్నారు కిష‌న్‌రెడ్డి. 2014లో ధాన్యం సేక‌ర‌ణ కోసం కేంద్రం రూ.3006 కోట్లు ఖ‌ర్చు చేస్తే, ప్ర‌స్తుతం ధాన్యం సేక‌ర‌ణ కోసం కేంద్రం 26,600 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ద‌ని ప‌ర్యాట‌క మంత్రి వెల్ల‌డించారు. రాష్ట్ర ప్ర‌భుత్వంతో కేంద్రం చేసుకున్న ఒప్పందం ప్ర‌కారమే ధాన్యం కొనుగోలు చేస్తాం అని మంత్రి వివ‌రించారు. దేశంలో ఎరువులు, విద్యుత్ కొర‌త లేద‌ని చెప్పారు. టీఆర్ఎస్ నేత‌లు అనేక విష‌యాల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని కిష‌న్‌రెడ్డి మండిప‌డ్డారు.

దాన్యం వర్షం లో తడిచిపోతుంటే కొనుగోలు చేయొద్దని బీజేపీ ప్రభుత్వం చెప్పిందా అని నిలదీసారు కిష‌న్‌రెడ్డి. కేసీఆర్ మాత్రం ఒక్కోక్క‌సారి ఒక్కో పంటను వేయాలని చెప్పారని.. ప్రస్తుత పంట కొనకుండా వచ్చే పంట గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మంత్రి ఫైరయ్యారు. నిన్న ఢిల్లీకి వచ్చిన మంత్రులు వ్యూహాత్మకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని.. కేసీఆర్ పట్ల అన్ని వర్గాల ప్రజలు ప్రధానంగా తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ప‌ని చేసిన వారు అసంతృప్తితో ఉన్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. కుటుంబ పార్టీలలో కుటుంబ సభ్యులే ముఖ్యమని,  ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కిష‌న్ రెడ్డి ప్రజలకు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: