కేంద్రం గతంలో తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో... రైతుల ప్లానింగ్ కూడా పూర్తిగా మారిపోయింది. గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువస్తూ కేంద్రం బిల్లు తీసుకువచ్చింది. అయితే ఈ బిల్లులను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ రాజధాని ఢిల్లీ నగర సరిహద్దులను దిగ్భందం చేశారు. ఏకంగా జాతీయ రహదారులపై ఆందోళన చేపట్టి దిగ్బంధించారు. అలాగే ఎర్రకోటపై రైతు జెండా ఎగురవేశారు. పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. పార్లమెంట్ బయట మాక్ అసెంబ్లీ నిర్వహించారు. నాలుగైదు సార్లు భారత్ బంద్ కూడా చేశారు రైతులు. ఎండా, వానా, చలి అని తేడా లేకుండా మొక్కవోని దీక్షతో ఆందోళన కొనసాగించారు. దీంతో... కేంద్రం దిగివచ్చింది. చివరికి గురు నానక్ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును రద్దు చేస్తామన్నారు. ఇదే విషయంపై ఈ నెల 24వ తేదీన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు కూడా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 29వ తేదీన పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న ట్రాక్టర్ మార్చ్‌ను రైతులు రద్దు చేశారు. అయితే... చట్టాలు రద్దు అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. వచ్చే నెలలో మరోసారి సమావేశం అవుతామన్నారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. సమావేశాలకు సరిగ్గా రెండు రోజుల ముందు మార్చ్ రద్దు నిర్ణయాన్ని రైతులు ప్రకటించారు. అయితే రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చే చట్టం కోసం తమ పోరాటం జరుగుతుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టం వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన రైతులకు స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: