ఒమ్రికాన్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు.. ఒమ్రికాన్.. ఈ పేరు చెబితే ఇప్పడు ప్రపంచంలోని అనేక దేశాలు వణికిపోతున్నాయి. కళ్ల ముందు కొన్ని నెలల క్రితం కదలాడిన సెకండ్ వేవ్‌ రోజులు కదలాడుతున్నాయి. మళ్లీ అలాంటి దురదృష్టపు రోజులు రాబోతున్నాయా అన్న ఆందోళన కనిపిస్తోంది. ఒమ్రికాన్.. అనేది కరోనాలోని కొత్త వేరియంట్.. ఇది వేగంగా వ్యాపిస్తూ కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికాలో వ్యాపిస్తున్న ఈ వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి ఆందోళనలో పడేసింది.


అయితే.. ఈ ఒమ్రికాన్ వేరియంట్ పుట్టినిల్లుగా చెబుతున్న దక్షిణాఫ్రికా ఈ వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కరోనా నూతన వేరియంట్ ఒమిక్రాన్‌ కట్టడి కోసం  దక్షిణాఫ్రికా పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఒమ్రికాన్ వ్యాప్తిని అరికట్టేందుకు బస్సులను, విమానాలను శానిటైజ్ చేస్తోంది. అంతే కాదు.. ఇప్పటికీ నత్తనడకన సాగుతున్న వ్యాక్సీన్ కార్యక్రమాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది.


ఒమ్రికాన్ కారణంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం దక్షిణాఫ్రికాను వెలివేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు దక్షిణాఫ్రికాకు రాకపోకలు నిలిపేశాయి. అయితే.. ఈ ఒమ్రికాన్  గురించి పూర్తి స్థాయి డేటా రాకముందే.. పలు దేశాలు తమపై ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా జీర్ణించుకోలేకపోతోంది. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం ఒమిక్రాన్‌ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని తేలింది. అయితే.. అంతర్జాతీయ సమాజం తమపై ప్రయాణ ఆంక్షలు విధించడం అన్యాయమని దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ మంత్రి జో ఫాహ్లా అంటున్నారు.


కరోనాలోని ఈ ఒమ్రికాన్ వేరియంట్ గురించి తాము ఏదీ దాచటం లేదని దక్షిణాఫ్రికా చెబుతోంది. ప్రపంచదేశాలు విధించిన ప్రయాణ ఆంక్షలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలకు చాలా విరుద్ధంగా ఉన్నాయని ఫాహ్లా ఆరోపించారు.  పండగల సీజన్‌కు ముందు ఇలాంటి వార్త రావడంతో దక్షిణాఫ్రికా పర్యాటక సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. సరిగ్గా పండగ సీజన్ లో ఇలా జరగడం దురదృష్టకరం అంటున్నాయి. విదేశీ పర్యాటకం దెబ్బతింటే దేశ ఆదాయంపైనా ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: