ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. నిన్న జ‌రిగిన లోక్‌స‌భ వైసీపీ ఎంపీల స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో జిల్లాల పున‌ర్విభ‌జ‌న అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. గ‌త ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా నోటిఫికేష‌న్ జారీకి సిద్ధం కావాల‌ని సీఎంవో ఆదేశంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆ త‌రువాత ఆదేశాలు రాక‌పోవ‌డంతో రెవెన్యూ అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటు చ‌ర్యను తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టారు.

మ‌రో వైపు వ‌చ్చే మార్చిలో జ‌న‌గ‌ణ‌న పూర్త‌య్యేంత‌వ‌ర‌కు దేశంలోని ఏరాష్ట్రంలో భౌగోళిక స‌రిహ‌ద్దుల‌ను మార్చ‌డానికి వీలు లేద‌ని భార‌త రిజిస్ట్రార్ కార్యాల‌యం వెల్ల‌డించింది. జ‌న‌గ‌ణ‌న పూర్త‌య్యే లోగా విభ‌జ‌న‌కు సంబంధించి ప్రాథ‌మికంగా ప్రక్రియ‌ను పూర్తి చేసి నోటిఫికేష‌న్ కు సిద్ధంకావాల‌ని సీఎం సూచించిన‌ట్టు స‌మాచారం. ఈ త‌రుణంలోనే వైసీపీ పార్ల‌మెంట్ స‌భ్యుల‌తో జ‌రిగిన స‌మావేశంలో నూత‌న జిల్లాల ఏర్పాటుతో కేంద్రం నుంచి నిధులు వ‌స్తాయ‌నే దానిపై చ‌ర్చ కూడా సాగింది.

ఇక 2022 జ‌న‌వ‌రి నుంచి జ‌న‌గ‌ణ‌న చేప‌ట్ట‌నున్న త‌రుణంలో ఈ ప్ర‌క్రియ చేప‌ట్ట‌డంపై సీఎం జ‌గ‌న్‌కు సీఎంఓ అధికారులు కొన్ని సూచ‌న‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాలు ఇబ్బంది క‌లుగ‌కుండా ఆర్థికేత‌ర అంశాల్లో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ లాంటి కార్య‌చ‌ర‌ణ‌ను చేప‌ట్టాల‌ని ఆదేశాలు ఇచ్చిన‌ట్టు వెల్ల‌డి అవుతుంది. దీనికోసం ఏర్పాటు అయిన సీఎస్ క‌మిటీ, జిల్లా స్థాయి క‌మిటీలు కూడా ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే నివేదిక‌లు అంద‌జేసిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌తీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ప్ర‌క‌టిస్తామ‌ని.. 25 లేదా 26 జిల్లాలు ఉంటాయ‌ని 2020 ఆగ‌స్టులోనే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది.   కొత్త జిల్లాల కోసం ఏర్పాటు అయిన రాష్ట్రస్థాయి క‌మిటీ, ఉప‌సంఘాలు, జిల్లా క‌మిటీలు కూడా వ‌రుస‌గా స‌మావేశాలు హ‌డావుడి చేసాయి. ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాలు ఉండ‌డంతో.. జిల్లా కేంద్రం కానున్న‌ ప‌ట్ట‌ణానికి మిగిలిన నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల దూరం, ఇత‌ర అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని కొన్ని ప్ర‌ణాళిక‌ల‌తో వివ‌రాల‌ను సిద్ధం చేసారు అధికారులు.  కేవ‌లం లోక్‌స‌భ స్థానాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని జిల్లాల‌ను ఏర్పాటు చేస్తే మాత్రం అవి 25కు చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే అర‌కు నియోజ‌క‌వ‌ర్గం విస్తిర్ణం పెద్దగా ఉండ‌డంతో దీనిని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి  ఏపీలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌ ప్ర‌క్రియ ముందుకు సాగుతుందో లేదో కొద్ది రోజులు వేచి చూడాలి మ‌రి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: