ప్రపంచ దేశాలన్నీ ఒమిక్రాన్ వేరియంట్ భయంతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పేరు చెబితేనే అందరూ హడలిపోతున్నారు. అందులోనూ దక్షిణాఫ్రికానుంచి భారత్ వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అయితే అది ఒమిక్రాన్ వేరియంట్ కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నా... గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందరికంటే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

ప్రజలు ఇబ్బంది పడినా కొన్ని కఠిన ఆంక్షలు తప్పవని తేల్చి చెప్పింది మహారాష్ట్ర సర్కారు. ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో అత్యధికంగా నష్టపోయింది మహారాష్ట్రనే. అందుకే ఈ సారి ముందుగా మహా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు అమలులోకి తెచ్చింది.

రెండు డోసులు తీసుకుంటేనే ఎంట్రీ..?
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందనే వార్తలు అందర్నీ కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు డోసులు తీసుకుంటేనే మహారాష్ట్రలోకి ఎంట్రీ అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. వ్యాక్సిన్ తీసుకోనివారిని మహారాష్ట్రలోకి రానివ్వబోమని అంటున్నారు. మరికొన్ని రోజుల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని ఆంక్షలు అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. కరోనా కేసుల్లో పెరుగుదల ఉంటే.. వెంటనే ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలనుకుంటోంది. ఒకవేళ సామాజిక వ్యాప్తి విస్తృతం అవుతుందనుకుంటే, లాక్ డౌన్ తరహా ఆంక్షలను కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీసుకు రావాలని చూస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఆంక్షలు సడలించి.. అంతలోనే..
దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల సేవలు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. అంతలోనే ఒమిక్రాన్ విరుచుకుపడుతోందనే సమాచారంతో మరోసారి పాత రోజుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎక్కడికక్కడ రాష్ట్రాలే ముందస్తుగా కట్టడి చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతున్నాయి. గతంలో లాగా కేంద్రం నిర్ణయంకోసం ఎదురు చూడకుండా.. ఇప్పుడు రాష్ట్రాలే అప్రమత్తం అవుతున్నాయి. ముందస్తుగా మహారాష్ట్ర ఆంక్షలను కఠినతరం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: