కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒకరు మంత్రి, ఇంకొకరు ఎమ్మెల్యే. ఒకరు కోస్తావాసి, ఇంకొకరు రాయలసీమకు చెందిన వ్యక్తి. ఇద్దరూ వైసీపీకి చెందినవారే అయినా.. ఇద్దరూ ఎప్పుడూ కామన్ గా చర్చల్లోకి వచ్చిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఎపిసోడ్ తో ఇద్దరూ ఒకేసారి చర్చల్లోకి వచ్చారు. ఇద్దరి మధ్యా పోలిక మొదలైంది. అయితే ఈ పోలికను టీడీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.

ఇంతకీ ఏమైంది..?
చంద్రబాబు పేరెత్తితే కొడాలి నాని ఏ రేంజ్ లో ఫైర్ అవుతారో అందరికీ తెలిసిన విషయమే. గారు అనే పదం వాడకపోయినా గాడు అనే పదం మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. విమర్శల్లో కొడాలి స్టైల్ అలాంటిది. అందులోనూ మిగతావారి విషయంలో కాస్తో కూస్తో ఆచితూచి మాట్లాడతారేమో కానీ చంద్రబాబు, లోకేష్ విషయంలో మాత్రం కొడాలి ఎక్కడా తగ్గరు. ఇటీవల చంద్రబాబు అసెంబ్లీ ఎపిసోడ్ లో కూడా దాదాపుగా ఈ స్థాయిలోనే కొడాలి ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు చెవిరెడ్డి విషయానికొద్దాం. చెవిరెడ్డి ఫైర్ బ్రాండే అయినా.. ఇటీవల ఎందుకో కాస్త సైలెంట్ అయ్యారు. తన నియోజకవర్గానికి సంబంధించి విపత్తుల విషయంలో ఆయన స్పందనను వైరిపక్షాలు కూడా మెచ్చుకుంటాయి. ప్రజల్లో అలా మమేకమైపోతుంటారు చెవిరెడ్డి. ఇటీవల వరద బాధితుల పరామర్శకు చంద్రబాబు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోనే ఓ గుట్టపై కూర్చుని ఉన్న చెవిరెడ్డి లేచి నమస్కారం చేశారు. చంద్రబాబు కూడా ఆయనకు ప్రతి నమస్కారం చేశారు. ఈ నమస్కారం, ప్రతి నమస్కారాల సంస్కార ఎపిసోడ్ ఇప్పుడు కొడాలి నాని వైపు తిరిగింది.

సీమ సంస్కారం ఇదీ అంటూ చెవిరెడ్డి ఫొటోలను కొంతమంది కొడాలి నానికి సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇది టీడీపీ బ్యాచ్ చేసే పనే అని అర్థమయినా.. వాళ్లు పరోక్షంగా చెవిరెడ్డిని పొగుడుతూ ఈ పనిచేయడంతో వైసీపీ బ్యాచ్ కూడా ఆసక్తిగా గమనిస్తోంది. చెవిరెడ్డి సీమ సంస్కారాన్ని చూపిస్తూ లేచి నిలబడి చంద్రబాబుకి నమస్కారం పెట్టారని, కానీ కొడాలి నాని.. చంద్రబాబుని అనరాని మాటలు అంటుంటారని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇలాంటివాటిని నాని పట్టించుకుంటారా, అసలు దీనివల్ల నాని ఇమేజ్ కి నష్టమేమైనా జరుగుతుందా అనే విషయాల్ని పక్కనపెడితే.. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ పెట్టి టీడీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: