ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడు మస్తు గరం గరంగా ఉన్నాయి. ఓ వైపు వరదలు, మరో వైపు మూడు రాజధానుల వ్యవహారం, అసెంబ్లీలో చంద్రబాబు ఘటన... వీటన్నిటికీ తోడు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు.. భగ్గుమంటుంది. ఇంకా చెప్పాలంటే చివరికి బూడిదే మిగులుతుంది. అంతలా రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే వైసీపని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇక ఇదే సమయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఇప్పుడు రెండు పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఆయా పార్టీల ఎంపీలతో పార్టీ అధినేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.

తమ పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై చర్చించారు. వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతం ముంపులోనే ఉందని తెలిపారు. వరద కారణంగా జరిగిన ప్రాణనష్టంపై పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు. ఇక రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వివేకానంద హత్య కేసుపై ప్రధానంగా చర్చించారు. హత్య కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్వాన్సుగా కోటి రూపాయలు ఇచ్చారనే విషయంపై ఈడీ విచారణకు పట్టుబట్టాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ఇక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్న విషయాన్ని సభలో చర్చించాలని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఇక రాష్ట్రానికి రాజధానిగా అమరావతి మాత్రమే అనే విషయాన్ని సభలో తీర్మానం చేసేలా చూడాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: