తెలంగాణ రాష్ట్రంలో  6,600 కు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని ఇప్పటివరకు సగం కేంద్రాలను కూడా ప్రారంభించలేదు. రోడ్లపైన ఖాళీ స్థలాల్లో, పంటపొలాల్లో ఆరబోసిన వరి ధాన్యం వద్ద రైతులు నెలల తరబడిగా పడిగాపులు కాసి వాన, చలిలో, ఆవేదనతో వాహనాలు పైనుండి పోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు ఎందరో. కళ్లముందు కనబడుతున్న రాష్ట్ర రైతాంగం యొక్క బాధను అర్థం చేసుకోని రాష్ట్ర ప్రభుత్వం రేపు రాబోయే యాసంగి పంట లో ఎంత కొనుగోలు చేస్తారో చెప్పాలని డిమాండ్ తో బాధ్యతారహితమైన మాటలు, బెదిరింపులకు పాల్పడడం ప్రజాస్వామ్య ప్రక్రియకు మంచిది కాదు.

       ప్రగతి భవన్ కోసం, రాష్ట్ర నూతన సెక్రటేరియట్ కోసం వందలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నగదు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఎందుకు వరి ధాన్యం కొనడం లేదు? ఇటీవలి మద్యం దుకాణాల వేలం కోసం దరఖాస్తుల ద్వారానే 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. కనీసం సగం 6 వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మీద పడిగాపులు కాస్తున్న రైతుల బాధ తీరేది కదా! ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వద్దకు కానీ, కల్లాలలో, రోడ్లమీద ఆరబోస్తున్న ధాన్యపు కుప్పల వైపు రైతుల దయనీయ పరిస్థితులను కళ్ళారా చూడడానికి మంత్రులు, కానీ శాసన సభ్యులు, ముఖ్యమంత్రి, ఏనాడు కూడా పర్యటించిన దాఖలాల్లేవు. పైగా రైతుల పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడానికి వెళ్లిన టువంటి బిజెపి అధ్యక్షుడు, శ్రేణులను తెరాస పార్టీ కార్యకర్తలు అడ్డుకొని రాళ్లదాడి, నల్లజెండాలతో నిరసన తెలపడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడుతనానికి నిదర్శనమని విజ్ఞులు, విశ్లేషకులు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 
         కేంద్ర ప్రభుత్వ మెడలను రాష్ట్ర ప్రభుత్వం వంచ లేకపోవచ్చు .కానీ" కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పై నిరంతరం పోరాటం చేసి ధాన్యం కొనుగోలు చేసేదాకా వెంట పడతామని, మెడలు వంచి తీరుతామని" పీసీసీ చీఫ్, ఇతర సీనియర్ నాయకులు  వారి దీక్షలో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రాధాన్యతను సంతరించుకున్నవి. "వరి ధాన్యం కొనకుండా ప్రలోభాలు, వాగ్దానాలు, ప్రకటనలు, అబద్ధాలతో కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చర్యలను ప్రతిఘటించాలి. అంటే ఖచ్చితంగా ప్రజానీకం, రైతులు గ్రామాలకు వచ్చే తెరాస నాయకులను రాళ్లతో కొట్టండి" అని ఈ సందర్భంగా వారి దీక్ష పిలుపు ఇవ్వడం ఆలోచించదగినది.

మరింత సమాచారం తెలుసుకోండి: