ఏపీ లో 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి పలువురు ఎన్నికల్లో పోటీ చేశారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం చిత్తుగా ఓడిపోయినా బాలయ్య మాత్రం హిందూపురంలో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కుప్పంలో చంద్రబాబు వరుసగా 8 వ సారి విజయం సాధించారు. అయితే గతంలో ఆయనకు వచ్చిన మెజారిటీ తో పోలిస్తే మొన్న‌ మెజారిటీ చాలా వరకు తగ్గిపోయింది. మంగళగిరి నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేసిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓడిపోయారు.

విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన బాలయ్య చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు భారత్ కేవలం మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయిన భ‌రత్ మాత్రం విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న పార్టీ నేతలకు అందుబాటులోనే ఉంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో భ‌ర‌త్ సీటు మారుతుంద‌న్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది.  2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంటే విశాఖపట్నం ఎంపీ సీటును జనసేనకు ఇస్తారని... అప్పుడు భరత్ మరో సీటు కు మారాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే భరత్ రాజమండ్రి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని తెలుస్తోంది.

భరత్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గం భరత్ సొంత ప్రాంతం. భరత్ తాత దివంగ‌త ఎంవీవీఎస్‌. మూర్తి ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లి అక్కడ వ్యాపార రంగంలో స్థిరపడిపోయారు. ఇక రాజమండ్రి ఎంపీ సీటు తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. పైగా ఇక్కడ క‌మ్మ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

ఇక్కడ పోటీ చేస్తే బాలయ్య ఛ‌రిష్మా కూడా ఆయనకు ప్లస్ అవుతుందని...  ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు వస్తుందని కూడా పార్టీ అధిష్టానం భావిస్తోంది. మరి ఎన్నికల వేళ‌ రాజకీయ సమీకరణలు ఎలా మార‌తాయో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: