\ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరిట మూడు రాజ‌ధానులు అంటూ తెగ హ‌డావుడి చేసిన జ‌గ‌న్ కు కోర్టుతో పాటు ఇంకొన్ని ప‌రిణామాలు కూడా అడ్డు చెప్పాయి. దీంతో మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసకున్నారు జ‌గ‌న్. పోనీ కొత్త బిల్లు ఎప్పుడు తీసుకువ స్తామో అన్న‌ది కూడా స్ప‌ష్టం చేయ‌లేదు. వ‌రుస వాన‌లు వ‌ర‌ద‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రాష్ట్రానికి మ‌రో క‌ష్టం రాక మునుపే మేల్కోవాల్సిన అధికారులు మొద్దు నిద్ర‌లో ఉన్నారు. ఈ త‌రుణంలో మ‌రో వివాదానికి తెర లేపేందుకు సీఎం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. కొత్త జిల్లాల పేరిట ఎప్ప‌టి నుంచో అనుకున్న విధంగా 13 జిల్లాలను కాస్త 25 జిల్లాలు చేయాల‌ని భావిస్తున్నారు. ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్నీ ఓ జిల్లా కింద ఎనౌన్స్ చేయాల‌ని అనుకుంటున్నారు. కానీ శ్రీ‌కాకుళం నుంచి కొన్ని అభ్యంత‌రాలు వ‌చ్చాయి.

ఈ జిల్లాను రెండుగానో మూడుగానో విడ‌దీస్తే.. ఇక్క‌డున్న శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిధిలో ఉన్న ఎచ్చెర్ల కాస్త విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిపోతుంది. దీంతో ఇక్క‌డ ఇంత‌కాలం ఉన్న ఎడ్యుకేష‌న్ హ‌బ్, ఇండ‌స్ట్రీయ‌ల్ హ‌బ్ కూడా అటే వెళ్లిపోతాయి. అప్పుడు శ్రీ‌కాకుళం ఆదాయం త‌గ్గ‌డ‌మే కాదు అభివృద్ధి కూడా కుంటుప‌డుతుంది. క‌నుక దీనిని శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిధిలోనే ఉంచాల‌ని డిమాండ్ చేస్తున్నారు ఇక్క‌డి ప్ర‌జ‌లు. అదేవిధంగా ప్ర‌కాశం జిల్లాలోనూ కొత్త జిల్లాల‌ల ఏర్పాటు విష‌య‌మై కొన్ని నిర‌స‌న‌లు వినిపిస్తున్నాయి. వీటిని కూడా ప‌రిష్క‌రించాల్సి ఉంది.

వ‌రుస వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌తో కాలం వెళ్ల‌దీస్తున్న ఏపీ స‌ర్కారుకు ఇప్పుడొక కొత్త ఆలోచ‌న వ‌చ్చింది. కేంద్రం నుంచి నిధులు రావాలంటే కొత్త జిల్లాల ఏర్పాటే అందుకు మార్గ‌మ‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే దీనిపై ఓ స్ప‌ష్ట‌త‌కు జ‌గ‌న్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎందుక‌నో మిగ‌తా వర్గాలు అంత‌గా ఆస‌క్తి అయితే చూప‌డం లేదు. జిల్లాల ఏర్పాటుకార‌ణంగా ప్రాంతీయ అస‌మాన‌త‌లు ఏమీ ర‌ద్ద‌యిపోవ‌ని, ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల బిల్లు ర‌ద్దు చేసుకుని న‌వ్వుల‌పాల‌య్యామ‌ని దీనిపై మ‌రో మారు ఆలోచ‌న చేయాల‌ని సీఎంను కో రుతున్నాయి వైసీపీ వ‌ర్గాలు. కానీ సీఎం మాత్రం  త‌న నిర్ణ‌యం ప్ర‌కారం ముందుకు వెళ్లాల‌నే అనుకుంటున్నారు. ఈ త‌రుణంలో కొత్త జిల్లాలు వ‌స్తే, ప్ర‌తి పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్నీ ఓ కొత్త జిల్లాగా ప్ర‌క‌టిస్తే వ‌చ్చే లాభం ఏంట‌న్న వాద‌న కూడా ఊపందుకుం టోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: