ఒక‌రినొకరు తిట్టుకుంటే ఏం రాదు. ఒక‌రినొక‌రు దూషించుకుంటే ఏం రాదు. అలా అని అదే ప‌నిగా ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌ల వాన కురిపించుకోన‌క్క‌ర్లేదు. ఉన్న కొద్ది రోజులూ క‌లిసి ఉంటే చాలు. మంచి ఫ‌లితాలు వ‌స్తాయి..ఇగోలు విడిచి సినిమా మేలు కోసం ప‌ని చేస్తే చాలు నలుగురికి అన్నం దొరుకుతుంది. వేల కుటుంబాల్లో పొయ్యి వెలుగుతుంది. సినిమా ఉంటేనే తిండి లేదంటే ప‌స్తు అని అనుకుని జీవించే కుటుంబాల క‌ళ్ల‌ల్లో ఆనందాలు విక‌సిస్తాయి. నిన్న‌టి వేళ అఖండ ఫంక్ష‌న్ అదిరిపోయింది. బాల‌య్య, బ‌న్నీ ఒకే వేదిక‌పై ఉండ‌డం ఆ కాంబినేష‌న్ ను చూసి అభిమానులు కేరింత‌లు కొట్ట‌డం ఇవ‌న్నీ బాగున్నాయి. ముఖ్యంగా బాల‌య్య కూడా చాలా బాగా మాట్లాడారు. నేను కాదు సినిమా గెల‌వాలి అన్న నినాదం అంద‌రినీ ఆలోచింప‌జేసింది. ఒక మ‌నిషిగా ఇష్ట‌ప‌డ‌డం వేరు, న‌టుడిగా ఇష్ట‌ప‌డడం వేరు అని చెప్పి అల్లు రామ‌లింగ‌య్య‌ను స్మరించిన తీరు కూడా ఎంతో బాగుంది. ఇవ‌న్నీ ఇండ‌స్ట్రీలో ఉన్న హిపోక్ర‌సీనో ఈర్ష్య‌నో అసూయ‌నో దూరం చేస్తాయి అని అన‌డంలో సందేహం లేదు. మంచి బంధాలు బ‌ల‌ప‌డ‌తాయి అని  చెప్ప‌డంలోనూ సందేహం లేదు.

అల్లు అర్జున్ నిన్న అంద‌రి ద‌గ్గ‌రా మార్కులు కొట్టేశాడు. స్టూడెంట్ నంబ‌ర్ 1 అనిపించుకున్నాడు. బాల‌య్య ఫంక్ష‌న్లో త‌న ఏవీ వేయించుకున్నాడు. అంతేకాదు బాల‌య్య తో త‌న మ్యాన‌రిజంను చేయించాడు కూడా! మీ ప్రేమ కోసం మీ అభిమానం కోసం జై బాల‌య్య అంటాను అని చెప్పి స‌రైనోడు అని అనిపించుకున్నాడు. ఇలా చాలా మాట‌లు నెటిజన్లు బ‌న్నీబాబును ఉద్దేశించి అంటున్నారు. అవును! నిన్న‌టి వేళ బ‌న్నీ బాబు చాలా మంది కి చాలా చాలా న‌చ్చేశాడు. ఎప్పుడూ ఉప్పు నిప్పు అన్న విధంగా ఉండే బాల‌య్య, చిరు కుటుంబాలు ఇప్పుడిప్పుడే ద‌గ్గ‌ర‌వుతున్నాయి. ఆహా కు బాల‌య్య ఓ టాక్ షో చేయ‌డంతో అల్లు ఫ్యామిలీ చాలా ఆనందించింది. స్టేజీపై కూడా త‌మ కుటుంబాల మ‌ధ్య ఉన్న సంబంధ బాంధ‌వ్యాలు ఎలాంటివి అన్న‌ది కూడా అల్లు అర‌వింద్, అల్లు అర్జున్ చెప్పారు. దీంతో అటు నంద‌మూరి ఫ్యామిలీ, ఇటు అల్లు ఫ్యామిలీ చాలా అంటే చాలా ద‌గ్గ‌ర‌య్యాయి. బాల‌య్య కూడా ఆహా లో చేస్తున్న అన్ స్టాప‌బుల్ టాక్ షోతో యాంక‌ర్ గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే విధంగా అన్ని కుటుంబాలు క‌లిసి ఉంటే ఇండ‌స్ట్రీ నిత్య క‌ల్యాణం ప‌చ్చ‌తోర‌ణం అన్న విధంగా విల‌సిల్లుతుంద‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: