దేశంలో పేదప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆయా బలహీన వర్గాలకు తగిన సౌకర్యాలు అందిస్తూ వస్తున్నారు. ఉదాహరణకు నిలువ నీడ లేని వారికి ఇళ్లు, తిండి లేని వారికి రేషన్ లాంటివి, ఇంకా అనేక గ్రూపులుగా వారిని విభజించి ఆర్ధికసౌలభ్యం కోసం తక్కువ వడ్డీకి లేదా వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని, వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడే ఆసరాను కల్పిస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఇంటి విషయం వచ్చేసరికే కాస్త వెసులుబాటు ఉంటె బాగుటుంది అంటున్నారు నిపుణులు. అన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే, ఇంటి విషయానికి వస్తే మాత్రం ఆయా చెరువులను పూడ్చేసి, అక్కడ ఇళ్లను కేటాయించడం అనవాయితీగా మారిపోతుంది.

దీనివలన అక్కడ ప్రజలు నెమ్మదిగా స్థిరపడి పోతూ, ఉన్న చెరువులు ఒకవేళ ఎక్కువ వర్షపాతం పడితే అక్కడ నుండి ఆ నీరు ఎటు వెళ్లాలో మార్గం లేక, సరాసరి పేదల ఇళ్లను ముంచేస్తున్నాయి. ఇలాంటి ఇళ్లు ఇచ్చే ముందు ఎంతో ఉన్నత అధికారులు ఆయా ప్రాంతాలను సందర్శించి ఆయా ప్రాంతాలలో కేటాయింపులు చేయాలా వద్దా అని ఆలోచిస్తారు కదా. అంటే అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నారని ఇక్కడ అర్ధం చేసుకోవాలా లేక వాళ్లపై అలా ఒత్తిళ్లు వచ్చాయని అర్ధం చేసుకోవాల్సి వస్తుందా! ఏది ఏమైనా నేడు బాధితులు మళ్ళీ  అదే పేదవాడు. ఉన్నదానితో ఏదో ఏర్పాటు చేసుకొని బ్రతుకు నెట్టుకొస్తుంటే, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వాళ్ళ స్థితిని మళ్ళీ మొదటికే తెస్తున్నాయి. మరి ఇప్పుడు గతంలో ఇచ్చిన పధకాలు అన్నీ నిర్వీర్యం అయినట్టేకదా. మళ్ళీ ప్రారంభించాల్సి వస్తుంది.  

ఇలా కాకుండా అధికారులు పేదలకు ఇళ్లు ఇచ్చేముందు ఆయా ప్రాంతాలలో వచ్చే ప్రమాదాలను  ఊహించి, దానికి తగిన విధంగా ఎక్కడ ఇళ్లను కేటాయిస్తే బాగుంటుందో ఆలోచించి, నేతలకు అది చెపితే బాగుంటుంది. నిజానికి అధికారులు చెప్పిన చోట నేతలు ఇళ్లు కేటాయించలేకపోవచ్చు కూడా. అందుకు మళ్ళీ స్వలాభం అనే అంశం తెరపైకి రాకతప్పదు. ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం ఒకవైపు, గతంలో కేటాయించిన పధకాల నిర్వీర్యం వలన అది కూడా నష్టమే అవుతుంది. ఇలా రెండింటా చెడేకంటే, అధికారులు చెప్పిన విధంగా ఇళ్లను కేటాయిస్తే బాగుంటుంది. ఒక్కోసారి అధికారి కూడా తప్పు కావచ్చు, అందుకే ఇలాంటి విషయంలో అధికారిని సరిగ్గా నియమించుకోవడం నేతల బాధ్యత. అప్పుడు ఇలాంటి రెండింతల నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. ప్రస్తుతం కూడా ఆయా చెరువులకు సరైన దారిని భూమి కిందనుండైనా ఏర్పాటు చేసి, ఆ నీటిని వేరే కరువు ప్రాంతాలలోకి వెళ్లేట్టుగా మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, నీటిని వాడుకున్నట్టుగా ఉంటుంది, జలవిలయాలు అనే ప్రమాదం లేకుండానూ ఉంటుంది. దీనికి అందరు కలిసి పనిచేయాల్సి వస్తుంది. అది కుదిరితే, ఇప్పుడు ఇది మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదేమో! అయినా ప్రయత్నించండి, పోయేదేముంటుంది, మహా అయితే సమస్య తీరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: