సానుభూతి అన్న‌ది సెంటిమెంట్ కొంద‌రికి. సానుభూతి అన్న‌ది హిట్ సెంటిమెంట్ ఇంకొంద‌రికి. రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు క‌నుక సానుభూతి ప‌నిచేస్తుందా లేదా ప్ర‌భావం చూపించ‌కుండా ఉంటుందా అన్న‌ది తేలిపోనుంది మ‌రికొద్ది నెల‌ల్లోనే! గ‌తంలో సానుభూతి రాజకీయాలు ఎన్టీఆర్ చేశారు. ఆ త‌రువాత జ‌గ‌న్ చేశారు. వీరే కాకుండా చంద్ర‌బాబు కూడా చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే బాట‌లో పోనున్నారు మ‌న మాజీ సీఎం.


అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ త‌మ‌దైన బాట‌లో ప్ర‌యాణించేందుకు ఇక‌పై ఇష్ట‌ప‌డుతూనే, కొంతలో కొంత ప్ర‌చారంలోకి కొత్త ముఖాలు తీసుకు వ‌స్తే బాగుంటుంది అని భావిస్తున్నాయి. దీని వ‌ల్ల చెప్పే విష‌యం సూటిగా జ‌నంలోకి పోవ‌డ‌మే కాకుండా, జ‌గం పోగ‌య్యేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది అని  స‌మాలోచ‌న చేస్తున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి అటు భువ‌నేశ్వ‌రి కానీ ఇటు భార‌తి కానీ వ‌స్తే రాజ‌కీయం ఇంకాస్త మారే అవ‌కాశం ఉంటుంది. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, దూష‌ణ‌లతో నిండిపోయాక రాజ‌కీయం మ‌రో మ‌లుపు అందుకోనుంది అని కూడా భావిస్తున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.  

జ‌గ‌న్ తో పాటు చంద్ర‌బాబు కూడా కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు. సానుభూతి రాజ‌కీయాల కార‌ణంగా గ‌త ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలే అందుకున్న జ‌గ‌న్ ను ఫాలో అయితే పోలా అన్న విధంగా చంద్ర‌బాబు రాజ‌కీయ ప‌రిణితిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఎంత చేసినా జ‌నం ప‌ట్టించుకోరు. ఎంత మాట్లాడినా వినిపించుకోరు. కానీ ఒక్క‌సారి అధికారంపోయి ఏడుపులు మొద‌లుపెడితే త‌ప్ప‌క గ‌మ‌నిస్తారు. త‌ప్ప‌క మ‌న్నిస్తారు కూడా! అందుకే ఏడుపు ఎవ‌రిది అయినా ఏడుపే.. ఓ విధంగా ఏడుపు ఓ లాజిక‌ల్ అండ్ టెక్నిక‌ల్ పాయింట్. ఈ సారి ఏడుపుతో పాటు కాస్త సింప‌థీ కూడా ఉంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారు చంద్ర‌బాబు. అందుకు అనుగుణంగానే రాజ‌కీయ నాట‌కాన్ని ర‌క్తి క‌ట్టించే ప‌నిలో పడ్డారు. గ‌తంలో జ‌గ‌న్ ఏ విధంగా అయితే రాజ‌కీయం చేసి అధికారం పొందారో అదే సూత్రాన్ని అవ‌లంబించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు చంద్ర‌బాబు.


రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేసి  సానుభూతి ద‌క్కించుకుంటే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న ఒక‌టి చేస్తున్నారు. అదే స‌మ‌యాన ఇంకేమ‌యినా వినూత్న ప్ర‌చారం చేసి ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోగ‌ల‌మా అన్న‌ది చూస్తున్నారు. ఈ క్ర‌మంలో జూనియ‌ర్ ను దూరం చేసి భువ‌నేశ్వ‌రిని సీన్ లోకి తీసుకు వ‌స్తున్నారు. మ‌రో వైపు జ‌గ‌న్ కూడా త‌న త‌ర‌ఫున ప్రచారానికి వెళ్లి, రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేలా భార‌తికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు. మ‌హిళ‌లు ప్రచారం చేస్తూ ఆస‌క్తిదాయ‌కంగా జ‌నం వింటార‌ని, వారు చెప్పే మాట‌లు ప్ర‌భావ వంతంగా ప‌నిచేస్తాయ‌ని ఇరు పార్టీల అధినేత‌లూ భావిస్తుండ‌డం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap