ఒమిక్రాన్.. ఇప్పుడు ప్రపంచం అంతా ఈ పేరు వింటేనే భయపడిపోతోంది. ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న కరోనా చేదు జ్ఞాపకాలను మరోసారి ఈ ఒమిక్రాన్ కళ్ల ముందుకు తెస్తుందేమో అన్న ఆందోళన పలువురిలో కనిపిస్తోంది. అవును మరి.. ఈ కరోనా వేరియంట్ గురించి వెలుగు చూస్తున్న వాస్తవాలు అలాంటివి.. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని.. దీని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు చెబుతున్నట్టే ఇది ఇప్పటికే అనేక దేశాల్లో ప్రవేశించింది. హడలెత్తిస్తోంది.  


ఇక ఈ ఒమిక్రాన్ డేంజరస్‌ ప్రవర్తన గురించి ఎయిమ్స్ డైరెక్టర్ చెబుతున్న విషయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అవేంటంటే.. ఈ ఒమిక్రాన్‌ వేరియంట్ కొవిడ్ వైరస్‌లో స్పైక్‌ ప్రొటీన్‌లో ఉన్న 30కిపైగా ఉత్పరివర్తనాలు ఉండొచ్చట. ఈ 30 ప్రపంచానికి ప్రమాదకరంగా మారొచ్చని గులేరియా హెచ్చరిస్తున్నారు. అంతే కాదు.. స్పైక్ ప్రోటీన్‌లో మార్పుల వల్ల రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం వైరస్‌కు లభిస్తుందట. అంటే దీన్ని క్రమంగా అరికట్టడం చాలా కష్టం అవుతుందన్నమాట.


ఇలాంటి ఈ స్పైక్ ప్రోటీన్లే మానవ శరీరంలోకి చొచ్చుకెళ్తాయట. మనిషిలో ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయని ఎయిమ్స్ డైరెక్టర్ చెబుతున్నారు. ఈ ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్ శక్తిని తగ్గించేందుకు కొవిడ్‌ టీకాలు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయట. అయితే ఈ స్పైక్ ప్రోటీన్లలో మ్యుటేషన్లు పెరిగిపోతే మాత్రం ఇంకా ఇబ్బందులు పెరుగుతాయట. అలా జరిగితే టీకాల సామర్థ్యం బాగా తగ్గిపోతుందని గులేరియా వివరిస్తున్నారు.


అందుకే  ఒమిక్రాన్‌పై ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా  అంటున్నారు.  వైరస్ వ్యాప్తి, రోగనిరోధకశక్తిపై కొత్త వేరియంట్ అయిన ఈ ఒమిక్రాన్ చూపే ప్రభావంపైనే దీన్ని ఎలా అరికట్టాలనే యాక్షన్ ప్లాన్ ఆధారపడి ఉంటుందంటున్నారు గులేరియా. ఏదేమైనా ఆ ఒమిక్రాన్ ఇండియాలో వ్యాపించకముందే.. దాన్ని అసలు ఇండియాకు రానివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: