డాలర్ శేషాద్రి.. తిరుమలలో శ్రీవారికి సంబంధించిన ఏ ఉత్సవం జరిగినా.. ఏ వేడుక జరిగినా ఆయన ఉండాల్సిందే. ఆయన లేకుండా తిరుమలలో స్వామి వారికి సంబంధించిన ఏ ముఖ్య కార్యక్రమం కూడా జరగదు. నిండైన రూపం.. మెడలో పెద్ద శ్రీవారి డాలర్.. ఇదీ ఆయన రూపం. అందుకే ఆయన్ను అంతా డాలర్ శేషాద్రి అంటారు. నిత్యం ఆ తిరుమలేశుని సేవలోనే తరించే డాలర్ శేషాద్రి చివరి శ్వాస వరకూ స్వామి వారి సేవలోనే ఉంటూ కన్నుమూశారు.

 
ప్రస్తుతం శ్రీవారి ఆలయ ప్రత్యేక అధికారిగా ఉన్న డాలర్ శేషాద్రి హఠాత్తుగా కన్నుమూశారు. విశాఖ పట్నంలో జరుగుతున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన డాలర్ శేషాద్రి అక్కడే గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు వచ్చిన ఆయన్ను ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. అలా ఆయన మరణించే చివరి క్షణం వరకు స్వామి సేవలోనే ఉండటం విశేషం.


ఇక డాలర్ శేషాద్రి నేపథ్యం ఓసారి గమనిస్తే.. ఆయన దాదాపు 40 ఏళ్లుగా ఏడుకొండలవాడి సేవలోనే ఉన్నారు. 1978 సంవత్సరం నుంచి ఆయన శ్రీవారి ఆలయంలో పని చేస్తున్నారు. ఆయన 2007లో పదవీ విరమణ చేశారు. అయితే.. ఆయన సేవలను ప్రత్యేకంగా గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన్ను ప్రత్యేక అధికారిగా నియమించి సేవలు కొనసాగిస్తోంది. డాలర్ శేషాద్రిగా ప్రసిద్ధి పొందిన ఆయన వీఐపీగా గుర్తింపు పొందారు. తిరుమలకు ఏ ప్రముఖుడు వచ్చినా.. ఆయన దగ్గరుండి పూలు చేయిస్తారు. అలా డాలర్ శేషాద్రికి చాలా పలుకుబడి కూడా ఉందని చెబుతారు.


డాలర్ శేషాద్రి చుట్టూ కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఇందిరాగాంధీ కాలం నుంచి తిరుమలలో పని చేస్తున్న ఆయన 2004-2006 లో బొక్కసం అధికారిగా పని చేశారు. ఆ సమయంలో 300 వరకూ డాలర్లు తేడా వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. ఇదే ఆరోపణలపై కొందరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నా.. తన పరపతితో ఆ వివాదం నుంచి బయటపడ్డారని చెబుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: