బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం కారణంగా ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత పదిరోజుల క్రితం కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి నిండి పోయాయి. వరదలు కూడా జనజీవితాన్ని అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోకి నీళ్లు చేరి, అవస్థలు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ అల్పపీడనం ఏర్పడి తీవ్రమైన వర్షాలు కురుస్తుండటంతో, జనానికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. వరదల భయం వెంటాడుతూ వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఏ చెరువు తెగిపోయి, ఊరిమీద పడుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రధానంగా నెల్లూరు జిల్లాపై అధిక ప్రభావం చూపిస్తోంది. నెల్లూరులో గత 48 గంటలుగా అతిభారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చిత్తూరు, కడప జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చెరువులన్నీ నిండిపోయి ఉండటంతో, పలు ప్రాంతాల్లో చెరువుల్లోని నీళ్లు బయటకు వెళ్లేందుకు వీలు లేక ఒత్తిడి పెరిగిపోతోంది. చెరువు కట్టలు తెగిపోయే పరిస్థితులు రావడంతో, జనం చెరువులకు గండ్లు కొడుతున్నారు. నెల్లూరు జిల్లాలో గత రాత్రి రాపూరు పెద్ద చెరువుకు కూడా గండి కొట్టి నీటిని బయటకు పంపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడన ప్రభావం అటు ప్రకాశం  జిల్లాలోని దక్షిణ ప్రాంతాలపై కూడా స్వల్పంగా కనిపిస్తోంది. అక్కడ కూడా ఓ మోస్తరుగా వర్షపాతం నమోదైంది.

నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు, నదీ పరివాహక ప్రాంతాలకు సమీపంలో ఉండే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచనలిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం ఇవ్వాలని అంటున్నారు. మరోవైపు వర్షాల కారణంగా వరదలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ భారీ వర్షాలతో జనజీవితం మాత్రం పూర్తిగా చిన్నాభిన్నమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: