ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మరోసారి అనారోగ్యం పాలయ్యారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మళ్లీ ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్‌ కొన్ని రోజుల క్రితం కరోనాకు గురయ్యారు..ఆయన కరోనా బారిన పడటం ఇప్పటికే రెండోసారి.. వయోభారం దృష్ట్యా ఆయన్ను హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.


దాదాపు వారం రోజులపాటు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న గవర్నర్ బిశ్వభూషణ్‌ కోలుకున్నారు. దీంతో ఆయన్ను డిశ్చార్జ్ చేసి విజయవాడ తీసుకెళ్లారు. అయితే.. విజయవాడ వెళ్లిన కొన్నిరోజులకే మళ్లీ ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో.. ఆయన్ను మరోసారి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.  


ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ మాత్రమే కాదు.. చాలా మంది కరోనా నుంచి కోలుకున్నా.. కరోనా అనంతర సమస్యలతో చాలా ఇబ్బందిపడుతున్నారు. కరోనాను జయించినా అది దేహంలో చేసిన అల్ల కల్లోలం నుంచి మాత్రం అంత సులభంగా బయటపడలేకపోతున్నారు. ప్రత్యేకించి ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఈ ఇబ్బందులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వయోభారం కారణంగా ఇప్పటికే బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా ఉండటంతో పోస్ట్ కోవిడ్ సమస్యలు వీరిని చాలా ఇబ్బంది పెడుతున్నాయి.


అందుకే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనాను జయించేశాం కదా అన్న దీమాతో ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి వయో వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందుల పాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి కరోనా సమస్యల నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: