కొన్నాళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ జ‌పిస్తున్న మంత్రం ద‌ళితుల ఉద్ద‌ర‌ణ.. స‌మాజంలో అట్ట‌డుగున ఉన్న ద‌ళితుల‌ను ఆదుకోవాల‌ని గులాబీ బాస్ అంటున్నారు. అందుకే ఒక్కో కుటుంబానికి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చేలా `ద‌ళిత బంధు` ను ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం నాలుగు నియోజ‌వ‌ర్గాల్లో ఈ ప‌థకం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించినా క్ర‌మంగా రాష్ట్రంలోని ద‌ళితులంద‌రికీ ద‌ళిత‌బంధు వ‌ర్తింపజేస్తామ‌ని టీఆర్ఎస్ చెబుతోంది. అయితే, కేసీఆర్ పై బీజేపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ద‌ళిత ద్రోహిగా మార‌డ‌ని మండిప‌డుతోంది.


   ద‌ళిత‌బంధు అమ‌లు నెపంతో ఎస్సీ స‌బ్ ప్లాన్ , కార్పొరేష‌న్ స‌బ్సిడీల‌ను ఎత్తివేయాల‌ని చూస్తోంద‌ని బీజేపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఇలా ద‌ళితుల‌ను మోసం చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గం స‌మావేశంలో ప‌లు తీర్మానాల‌ను ఆమోదించింది. అందులో ద‌ళిత‌బంధు పై కూడా తీర్మానం ఉంది. రాజకీయం, రైతు స‌మ‌స్య‌లు, ద‌ళిత‌బంధు, నిరుద్యోగం అంశాల‌పై బీజేపీ తీర్మానాలు చేసింది.


 హుజురాబాద్ ఫ‌లితాలు తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రం మార్చ‌బోతున్నాయంటున్న బీజేపీ నేత‌లు.. గులాబీ పార్టీపై యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జా వ్య‌తిరేక విధ‌నాలు, ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. దీంట్లో భాగంగానే వ్య‌వ‌సాయ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని, త‌క్ష‌ణ‌మే వ‌ర్షానికి త‌డిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది బీజేపీ. రైతులు ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌కోసం స‌బ్సీడీపై విత్త‌నాలు, వ్య‌వ‌సాయ ప‌నిముట్లు అంద‌జేయాల‌ని చెబుతోంది.


   టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీ నేత‌లు ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.  అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లే ల‌క్ష్యంగా  ప్ర‌భుత్వంపై శంకారావం పూరిస్తున్నారు. దీంతో పాటు పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కారు పార్టీలో అసంతృప్తులుగా ఉన్న నేత‌ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు గాలాలు వేస్తున్నారు. మ‌రి భ‌విష్య‌త్తులో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: