తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వరి రాజకీయం జోరుగా సాగుతోంది. యాసంగి పంటపై తొలి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఓ యుద్ధమే నడుస్తోంది. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత... ఆ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అసలు కేంద్రం తీరును తప్పుబడుతూ... ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ధర్నా చేశారు. రాష్ట్ర మంత్రులంతా రైతులకు అండగా ఉంటామంటూ ఆందోళనలు చేశారు. ఇదే సమయంలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అటు ధాన్యం కొనలంటూ రాష్ట్ర మంత్రులంతా కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీ పయనమయ్యారు. కానీ కేంద్ర మంత్రులు మాత్రం కనీసం స్పందించలేదు. కొంతమంది మంత్రులు అయితే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తెలంగాణ మంత్రులు... తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై హస్తినలో జరిగిన అవమానాన్ని వివరించారు.

అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే... కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు అటు కాంగ్రెస్, ఇటు గులాబీ పార్టీ నేతలు ప్రయత్నించారు. వరి కొనుగోలు అంశంపై పార్లమెంట్‌లోనే కేంద్రాన్ని నిలదీస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. వరి కొనుగోలుపై వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టగా... టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ పార్లమెంట్ ఆవరణలోనే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ధాన్యం దిగుబడుల మేరకు ఎఫ్‌సీఐ కొనుగోళ్లు చేపట్టాలని గులాబీ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలోనే ప్లేకార్డులు ప్రదర్శించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే తెలంగాణ రైతులకు అన్యాయం చేయవద్దని నినాదాలు చేశారు ఎంపీలు. జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని కూడా టీఎర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్లకార్డులతో నిరసన చేశారు. రైతులకు ఉచిత కరెంట్ అందించడం వల్లే రాష్ట్రంలో వరి దిగుబడులు పెరిగాయన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. రైతుల సంక్షేమం కోసం అవసరమైన విధానాలను కేంద్రం తక్షణమే తీసుకురావాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: