ఏపీలో ఎన్నికలకు ఇంకా సగం టైమ్ మాత్రమే ఉంది. అంటే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి ఇంటర్వెల్ దాకా కధ వచ్చిందనుకోవాలి. ఇప్పటిదాకా పాలన ఎలా ఉన్నా రెండవ భాగంలో ఎక్కువగానే పొలిటికల్ ట్విస్టులు ఉంటాయని అంతా చూస్తున్నారు.

అయితే క్లైమాక్స్ రక్తి కట్టి తమకే సీన్ అనుకూలంగా మారుతుంది అని విపక్ష తెలుగుదేశం కోటి ఆశలను పెట్టుకుంటోంది. ఇదిలా ఉంటే వైసీపీ ఏర్పాటు నుంచి అతి పెద్ద వెన్ను దన్నుగా ఉన్న రాయలసీమ జిల్లాలు ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటాయా అన్న చర్చ అయితే ఉంది. జగన్ ని వైఎస్సార్ తో సరిసమానంగా ఊహించుకుని ఆయనకు మద్దతు ఇచ్చిన రాయలసీమవాసులకు ఎందుకో చాలా విషయంలో అసంతృప్తి ఉందని చెబుతున్నారు.

జగన్ అధికారంలోకి వస్తే సీమ కష్టాలు అన్నీ ఒక్క దెబ్బకు తుడిచి పెట్టుకుపోతాయని వారు భావించారు. అయితే జగన్ మూడు రాజధానుల వ్యవహారంతోనే సీమ జనాలు రగిలిపోయే డెసిషన్ తీసుకున్నారు అంటున్నారు. సీమకు ఇస్తే రాజధాని ఇవ్వాలి కానీ జ్యూడీషియల్ క్యాపిటల్ పేరిట ఏదో చేశామని చెప్పడమేంటి అన్న విమర్శలు వస్తున్నాయి.

అయితే ఇపుడు మూడు రాజధానుల చట్టాన్ని కూడా జగన్ సర్కార్ రద్దు చేసుకుంది. దాంతో సీమ ప్రజానీకంలో ఆగ్రహం కనిపిస్తోంది. ఇక క్రిష్ణా జలాల విషయంలో కూడా వారికి న్యాయం జరగడం లేదని మండిపోతున్నారు. సీమ ప్రాంతానికి చెందిన ప్రాజెక్టులన్నిటికీ నీటి కేటాయింపులు జరిగేలా చూడాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడంలేదన్న బాధ ఉంది. మరో వైపు ఉపాధి కల్పనలో కూడా పెద్దగా అడుగులు పడలేదని, అభివృద్ధి అన్నది లేదని కూడా వారి ఆలోచనగా ఉంది.

ఇక ఈ మధ్య వచ్చిన వరదలు దారుణాన్నే మిగిల్చాయి. ఏకంగా యాభై ఏళ్లలో ఇలాంటి విలయాన్ని చూడలేదు అన్న మాట ఉంది. అయితే జగన్ ఆ సమయంలో కనీసం పర్యటించలేదు, ఓదార్చలేదు అన్న విమర్శలు  అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటితో పాటు సీమలో ఒక ప్రధాన సామాజిక వర్గం తమకు రాజకీయంగా ప్రాధాన్యత లేదని మండిపడుతోంది. ఇవన్నీ కలసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ మీద  ప్రతికూల ప్రభావం చూపుతాయా అంటే చూడాలి అంటున్నారు. మొత్తానికి గతం కంటే కూడా సీమ లో తమకు గరిష్టంగా రాజకీయ లాభం కలుగుతుంది అని టీడీపీ ధీమాగా ఉందిట.


మరింత సమాచారం తెలుసుకోండి: