శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. రాజాం నియోజకవర్గంలో టీడీపీని నడిపించే నాయకుడు ఎవరో? నెక్స్ట్ ఎన్నికల్లో రాజాం సీటు నుంచి పోటీ చేసే నాయకుడు ఎవరో? ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది. మామూలుగా రాజాంలో టీడీపీకి బలం ఎక్కువే. ఇక ఈ సీటు మాజీ స్పీకర్ ప్రతిభా భారతిదే.

కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌కు చంద్రబాబు సీటు ఇచ్చారు. ప్రతిభా వరుసగా ఓడిపోతున్న నేపథ్యంలో బాబు వ్యూహం మార్చి కొండ్రుకు సీటు ఇచ్చారు. అయినా సరే జగన్ గాలిలో కొండ్రు ఓటమి పాలయ్యారు. మరొకసారి రాజాం ఎమ్మెల్యేగా కంబాల జోగులు విజయం సాధించారు. అయితే వరుసగా గెలుస్తూ వస్తున్న జోగులుపై రాజాంలో వ్యతిరేకత మొదలైంది. ఆయన పనితీరు పట్ల ప్రజలు పెద్దగా సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.

ఇక వైసీపీపై ఉన్న వ్యతిరేకతని టీడీపీ ఉపయోగించుకుని పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఆ ఛాన్స్‌ని టీడీపీ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. ఎందుకంటే టీడీపీకి సరైన నాయకత్వం లేదు. అసలు రాజాం టీడీపీకి నాయకుడు ఎవరో..ఆ పార్టీ క్యాడర్‌కే క్లారిటీ లేదు. ఎన్నికల్లో ఓడిపోయాక కొండ్రు సైలెంట్ అయ్యారు...టీడీపీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రతిభా కుమార్తె గ్రీష్మకు రాజాం సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. ఎలాగో గత ఎన్నికల్లో సీటు త్యాగం చేశారు కాబట్టి, వచ్చే ఎన్నికల్లో ప్రతిభా కుమార్తెకు సీటు ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయ్యారని ప్రచారం జరిగింది.

ఈ సమయంలోనే కొండ్రు మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. రాజాంలో వరుసపెట్టి వైసీపీ కార్యకర్తలని టీడీపీలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దీంతో మరోసారి రాజాం టీడీపీలో ట్విస్ట్ వచ్చింది. అలా అని కొండ్రుకు సీటు గ్యారెంటీ లేదు. మరి చూడాలి రాజాం సీటుని చంద్రబాబు ఎవరికి ఇస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: