కరోనాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో ప్రపంచమే ఇప్పుడు వణికిపోతోంది. కొత్తగా ఎక్కడ ఒమిక్రాన్ కేసులు వచ్చినా హడలిపోతున్నారు. మరోసారి కరోనా రోజులను ఒమిక్రాన్ మళ్లీ తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే హెచ్చరిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒమిక్రాన్ దృష్ట్యా కొత్త జాగ్రత్తలు తీసుకుంటోంది. కొవిడ్, వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌.. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రబలుతున్న దృష్ట్యా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి.. అధికారులకు పలు ఆదేశాలిచ్చారు.


హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్‌ మెడికల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఏపీకి వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ చేయనున్నారు. అలాగే ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు మాత్రమే చేయాలని.. ర్యాపిడ్‌ టెస్ట్‌లు వద్దని ఇప్పటికే అధికారులుకు ఆదేశాలు అందాయి. అందరూ  మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని.. జనాలు గుమిగూడకుండా చూడాలని  సీఎం జగన్ ఆదేశించారు. మాస్క్‌ విషయంలో మళ్ళీ డ్రైవ్‌ చేయాలని సీఎం ఆదేశం గతంలో ఉన్న నిబంధనలు అమలుచేయాలని.. క్రమం తప్పకుండా ఫీవర్‌ సర్వే జరగాలని జగన్ ఆదేశించారు.


కరోనా కట్టడికి వ్యాక్సీన్ అత్యవసరమన్న జగన్.. డోర్‌ టూ డోర్‌ వ్యాక్సినేషన్, ఫీవర్‌ సర్వే రెండూ నిర్వహించాలన్నారు. ఎంప్యానల్‌ ఆసుపత్రులలో వసతులు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలని.. క్వారంటైన్‌ సెంటర్స్, కోవిడ్‌ కేర్‌ సెంటర్స్, కోవిడ్‌ కాల్‌ సెంటర్‌లను తిరిగి పరిశీలించాలని సీఎం జగన్ సూచించారు. ఏ అనారోగ్య సమస్య ఉన్నా 104కు కాల్‌ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలని.. జిల్లా స్ధాయిలో కలెక్టర్‌లను, లైన్‌ డిపార్ట్‌మెంట్‌లను సిద్దం చేయాలని జగన్ పిలుపు ఇచ్చారు.


ఒమిక్రాన్ పట్ల అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యమన్న సీఎం జగన్.. వ్యాక్సినేషన్‌ మరింత ఉద్ధృతంగా చేయాలన్నారు. కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలని.. టార్గెట్‌ పెట్టుకుని మరీ వ్యాక్సినేషన్‌ చేయాలని సీఎం జగన్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: