ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ గురించి రోజుకో కొ‌త్త విషయం వెలుగు చూస్తోంది. ఇందులో చాలా వరకూ నెగిటివ్ విషయాలు ఉంటే.. ఒకటి రెండు పాజిటివ్ విషయాలు కూడా ఉంటున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ  చెబుతున్నదాని ప్రకారం.. ఈ ఒమిక్రాన్ వేరియంట్ మరీ మనం అనుకున్నంత డేంజరస్ కాకపోవచ్చని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ గురించి అక్కడి నిపుణులు తమకు తెలిసిన విషయాలు పంచుకుంటున్నారు.


తాజాగా దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ  చెబుతున్నదేమిటంటే.. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయట. ఈ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ.. దక్షిణాఫ్రికా వ్యాక్సిన్‌ కమిటీలో సభ్యురాలు కూడా. అంతే కాదు.. ఈ కోయెట్జీ.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తొలిదశలోనే అనుమానించారు. ఆమె ఏం చెబుతున్నారంటే..  డెల్టా వేరియంట్‌ కంటే భిన్నమైన లక్షణాలతో ఏడుగురు పేషెంట్లు ఆమె వద్దకు వెళ్లారట. వీరిలో స్వల్పంగా మాత్రమే కరోనా లక్షణాలు కనిపించాయట.


ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారు మిగిలిన కరోనా వేరియంట్ తరహాలోనే  తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పితో రెండ్రోజులు బాధపడ్డారట. అయితే.. వీరందరికీ ఇంటి వద్ద ఉంచే చికిత్స అందించామంటున్నారు కోయట్జీ. వీరిలో వాసన, రుచి పోవడం, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడం వంటి లక్షణాలు  కూడా కనిపించలేదట. అందుకే ఈ ఒమిక్రాన్ మరీ అంత డేంజరస్ కాకపోవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరో గుడ్ న్యూస్ ఏంటంటే..  ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఇతర వేరియంట్ల తరహాలోనే ఆర్టీ పీసీఆర్  పరీక్షల్లో గుర్తించవచ్చట. ఈ వేరియంట్‌ వ్యాప్తి వేగం గురించి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలు చేస్తోంది. అయితే.. ఈ ఒమ్రికాన్ వేరియంట్‌ లక్షణాలు మిగిలిన వాటికంటే ఎంత భిన్నంగా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు. అంతే కాదు..  కొవిడ్‌ బారినపడిన వారు కూడా మరోసారి ఒమిక్రాన్‌ బారిన పడేందుకు అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: