తెలుగుదేశం పార్టీలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్. పార్టీ సంక్షోభంలో ఉన్న ప్రతీసారి ఎక్కడో ఒకచోట జూనియర్ ప్రస్తావన లేకుండా మాత్రం చర్చలు సాగవు. అంతలా జూనియర్ తనదైన ముద్రను టీడీపీపై వేశారు. అయితే ఇటీవల వైసీపీకి చెందిన కొడాలినాని, వల్లభనేని వంశీలను, వారిద్దరికీ గురువైన ఎన్టీఆర్ కంట్రోల్ చేయాలంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. దీనిపై జూనియర్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే ఎన్టీఆర్ అభిమానులు హల్చల్ చేశారు. సీఎం ఎన్టీఆర్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వివాదం కాస్తా పెరిగి టీడీపీలో చిచ్చు రేపుతోంది.

అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఎలా కంట్రోల్ చేయాలి. అభిమానులకు కూడా ఎన్టీఆర్ చెప్పగలరా..? ఒకవేళ చెప్పినా ఏమని చెప్పాలన్నదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. పార్టీలో తనకు ప్రాధాన్యం లేదని ఎన్టీఆర్ నేరుగా చెప్పలేని పరిస్థితి. తన సొంత అభిమానులను కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఆయనది. దీంతో టీడీపీ నేతలు ఇప్పుడు మరింత అగ్గిమీద గుగ్గిలంలా మారిపోతున్నారు. ఎన్టీఆర్ బలప్రదర్శనకు దిగుతున్నారని అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. గతంలోనూ చంద్రబాబు ఇలాగే ఎన్టీఆర్ ను పక్కన పెట్టిన సమయంలో, ఎన్టీఆర్ తన బలమేమిటో చూపించారు. ఓ సినిమా వేదికలో తన బలగాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అప్పట్లా ఎన్టీఆర్ ప్రవర్తిస్తారా..  రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటారా.. లేక మౌనంగానే ఉంటారా అనేది చూడాలి.

ఏపీ రాజకీయాల్లోకి సినీ ప్రముఖులు రావడం కొత్తేమీ కాదు.. తొలినాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి.. ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించారు. ఆ తర్వాత మెగాస్టార్ కూడా పార్టీ పెట్టారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఆయన కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తారా.. లేక టీడీపీకి సపోర్ట్ గానే కొనసాగుతారా..? అనేది ఇప్పుడప్పుడే తేలే విషయం కూడా కాదు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ తన అభిమానులను కంట్రోల్ చేయాలని, లేకపోతే పార్టీలో అనవసరమైన అనుమానాలు చెలరేగుతాయని తెలుగుదేశం పార్టీ అభిమానులు మాత్రం చెప్పుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ పై విమర్శలు వచ్చినప్పుడల్లా ఇలాగే అభిమానులు రచ్చ చేయాలనుకుంటున్నారు. టీడీపీతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కి ప్రత్యేక బలం ఉందని చెప్పాలనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: