తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ ఎంతో కాలంగా ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఉత్తర భారతంలో సత్తా చాటిన కమలం పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ స్థాయి గుర్తింపు రావడం లేదు. పేరుకు క్యాడర్ ఉన్నప్పటికీ... ఎన్నికల్లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. 2014 ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ... 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేశారు. అయితే కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్లు దక్కలేదు. టీడీపీ కలిసి అధికారం చెలాయించినప్పటికీ... అది అంత సంతృప్తి కలిగించలేదు. అయితే కొద్ది రోజులుగా రాష్ట్రంలో అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కమలం పార్టీ పెద్దలు... టార్గెట్ 2024 అంటూ సరికొత్త మాట అందుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాషాయ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు బీజేపీ అగ్రనేతలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీని పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఏపీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాజాగా ప్రకటించిన కోర్ కమిటీలో నలుగురు ఎంపీలతో పాటు మరో 9 మందికి కూడా అవకాశం దక్కింది. వీరితో పాటు మరో ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులకు కమిటీలో స్థానం దక్కింది. అలాగే కోర్ కమిటీ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది పార్టీ అధిష్టానం. ఇకపై ప్రతి నెలకు ఒకసారి అయినా సరే... కోర్ కమిటీ సమావేశం జరగాలని ఆదేశించింది. ఏపీ కోర్ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్, ఎంపీలు జీవిఎల్, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీ నారాయణ, మధుకర్, ఎమ్మెల్సీ మాధవ్, రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి, నిమ్మక జయరాజులతో కూడిన కోర్ కమిటీ ప్రతి నెలా సమావేంశం అవ్వాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP