గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన అయినప్పటికీ... తొలి నుంచి ఆ పార్టీ నేతలపైనే కాకుండా.. ఏకంగా అధినేతపైనే నిప్పులు కురిపిస్తున్నారు నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు. వైసీపీ తరఫున గెలిచిన ఆర్ఆర్ఆర్... ఆ పార్టీ పైనే పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తీరుపై గుర్రుగా ఉన్న పార్టీ అధిష్ఠానం... పార్లెమెంట్ సభ్యత్వం నుంచి తొలగించాలంటూ లోక్ సభ స్పీకర్‌కు లేఖ కూడా రాశారు. చివరికి వైఎస్ జగన్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. అయినా సరే... రఘురామ దూకుడు ఏ మాత్రం తగ్గలలేదు. జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ ఏకంగా సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీలో రఘురామ చేరుతున్నారనే పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో రఘురామ కృష్ణంరాజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చాలాకాలం కలిసి ఆర్ఆర్ఆర్... రాష్ట్రంల జరుగుతున్న పరిణామాల్ని షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ జగన్ సర్కార్‌పై రఘురామ ఫిర్యాదు చేశారు. అలాగే పలు అంశాలపై కూడా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అమరావతి రైతుల పాదయాత్ర, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వరదల సమయంలో ప్రకృతి సకాలంలో స్పందించలేదంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి బీజేపీ నేతలు మద్దతు ఇవ్వాలని ఆదేశించడాన్ని స్వాగతించారు. అమిత్ షా పర్యటన తర్వాతే... జగన్ మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును వెనక్కి తీసుకున్నారని... ఇందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రఘురామ కృష్ణంరాజు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కోరినట్లు భేటీ అనంతరం రఘురామ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: