ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకొని గాడిన పడుతున్న దేశాలన్నీ ఈ కొత్త వైరస్ తో ఆందోళనకు గురవుతున్నాయి. జనం కూడా మళ్ళీ థర్డ్ వేవ్ ముంచుకొస్తోందేమోనని కంటిమీద కునుకు లేకుండా భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దేశంలోని 44 కోట్ల మంది చిన్నారులకు కూడా టీకాను వేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఆ టీకా ఉచితంగానే వేస్తారా.. అనే విషయంపై మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయలేదు. దేశంలోకి థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకునేందుకు చిన్నారులకు టీకాలు వేయడమే మార్గమని భావిస్తోంది. ఆ దిశగా ఏర్పాట్లను కూడా కేంద్రం ప్రారంభించింది.

అయితే దేశంలో ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ఇప్పటికే సగటు మనిషి జీవించడం కష్టంగా మారింది. ఇదేమిటని ప్రశ్నించలేని పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏమైనా అడగాలంటే చాలు.. వాక్సిన్ ఉచితంగా ఇస్తున్నాం కదా అంటూ ఎదురవుతున్న ప్రశ్నలతో, ఏం మాట్లాడలేని పరిస్థితి జనాలది. ఇప్పుడు తాజాగా పిల్లలకు కూడా వాక్సిన్ ఇస్తారని చెబుతుండటంతో జనం భయపడుతున్నారు. ఆ వాక్సిన్ కోసం కేంద్రం చేసే ఖర్చును కూడా జనం నెత్తిన భారంగా వేస్తారేమోనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇలా ఉచితంగా వాక్సినేషన్ పేరుతో ఇప్పటికే గత రెండేళ్లుగా జనాల నెత్తిన పెద్ద బండ వేసింది కేంద్రం. సగటు పౌరుడి జేబుకు చిల్లుపెట్టారు. ప్రతీ వస్తువుపైనా ధరలు పెంచేసి ఉచిత వాక్సిన్ పేరు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు 44 కోట్ల మంది చిన్నారులకు వాక్సిన్ వేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వేల కోట్ల రూపాయలతో కూడుకున్న పని కావడంతో జనం బెంబేలెత్తి పోతున్నారు. ఇప్పటికే రెండు దఫాలు వాక్సిన్ వేసుకున్న వారికి కూడా, మూడవసారి బూస్టర్ డోస్  వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అది కూడా కార్యరూపం దాలిస్తే ఇక ధరలను అదుపు చేయడం ఎవరితరమూ కాదు. ఇప్పటికే కరోనా కారణంగా ఎంతో మంది రోడ్డునపడ్డారు. ఇప్పుడీ థర్డ్ వేవ్ ప్రభావంతో మరింతగా నష్టపోయే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: