సాంకేతికంగా పార్టీతో ఎప్పుడూ ఎలాంటి సంబంధం లేని జూనియర్ ఎన్టీయార్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు డిమాండ్లు పెరిగిపోతున్నాయి ? తనకు ఎలాంటి సంబంధం లేని అంశంపై జూనియర్ కేంద్రంగా ఎందుకని వివాదాలు పెరిగిపోతున్నాయి ? ఎందుకంటే చంద్రబాబునాయుడు, లోకేష్ వైఖరి వల్లే పార్టీలో జూనియర్ కు మద్దతుగా డిమాండ్లు పెరిగిపోతున్నట్లు అర్ధమవుతోంది. అవసరానికి వాడుకుని తర్వాత పార్టీకి జూనియర్ ను చంద్రబాబు దూరంగా పెట్టేశారనే ఆరోపణలకు కొదవేలేదు.

చాలాకాలంగా జూనియర్ కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా పార్టీలోను, బయటా జూనియర్ ప్రస్తావన ఎందుకు వస్తున్నట్లు ? మొన్ననే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో తన భార్య భువనేశ్వరి గురించి అనుచితంగా మాట్లాడారంటు చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున ఏడ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇదే సమయంలో తన తల్లిని దూషించిన వారిపై లోకేష్ కూడా పెద్దగా స్పందించలేదు. ఒకవైపేమో తండ్రి ఏడుపు మరోవైపు కొడుకు నిరసక్తమైన స్పందనతో పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు.

భార్యను, తల్లిని ప్రత్యర్ధులు కించపరిచినా చంద్రబాబు, లోకేష్ నుండి ఆశించిన స్ధాయిలో స్పందన కనబడకపోవటం నిజంగా షాకింగే. అందుకనే జూనియర్ ప్రస్తావన పదే పదే వస్తోంది. టీడీపీ నేతలు వర్ల, బుద్ధావెంకన్నలు చెప్పినట్లుగా ఒక సింహాద్రి మరో ఆది సినిమాల్లో వచ్చినట్లు కత్తో , గొడ్డలో పట్టుకుని ఏ నేతా ఫీల్డులో కనబడడు. కానీ అంత స్ధాయిలో చంద్రబాబు, లోకేష్ స్పందించని కారణంగానే అందరు జూనియర్ జపం చేస్తున్నారు.

జూనియర్ రంగంలోకి దిగితే ఏమవుతుందన్నది వేరే సంగతి. నిజానికి జూనియర్ ప్రస్తావన తేవటం చంద్రబాబు, లోకేష్ కు ఏమాత్రం ఇష్టంలేదన్నది అందరికీ తెలిసిందే. అయినా బుచ్చయ్య చౌదరి లాంటి నేతలు జూనియర్ పార్టీకి సేవలు అందించాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారంటే తండ్రి, కొడుకుల వైఖరే కారణమని అందరికీ అర్ధమవుతోంది. పార్టీ అధినేత ప్రత్యర్ధుల కళ్ళల్లో నీళ్ళు తెప్పించాలి కానీ తానే నీళ్ళు పెట్టుకుని గుక్క తిప్పుకోకుండా మీడియా సమావేశంలో ఏడుస్తు కూర్చుంటే ఎలాంటి ఉపయోగముండదు.

జగన్మోహన్ రెడ్డి వ్యవహారమే తీసుకుంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఇంట్లోనుండి కదల్లేదు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో కూడా ప్రచారానికి రాలేదు. అదే చంద్రబాబును తీసుకుంటే కార్పొరేషన్ ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశారు. తిరుపతి ఎన్నికల్లో ఎన్ని రోడ్డుషోలు పాల్గొన్నారో అందరు చూసిందే. తండ్రి, కొడుకులు విడతల వారీగా ఒకరి తర్వాత మరొకరు ప్రచారం చేశారు.

ఇక కుప్పంలో అయితే తండ్రి, కొడుకులు ఎంత చెమటోడ్చారో అందరు చూసిందే. కానీ చివరకు ఏమైంది ? గడప దాటకుండానే అన్నీ ఎన్నికలను జగన్ గెలుచుకున్నారు. ఇలాంటి రాజకీయాన్నే తమ్ముళ్ళు చంద్రబాబు నుండి ఆశించారు కానీ చివరకు ఏమైంది ? అందుకనే తమ్ముళ్ళు జూనియర్ కు పార్టీలో డిమాండ్ పెరిగిపోతున్నది. చివరకు ఏమవుతుందో ఏమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: