సజ్జల రామకృష్ణారెడ్డి.... పేరుకే ప్రభుత్వ ప్రధాన సలహాదారు... కానీ... రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అంతకు మించిన బాధ్యతలే నిర్వహిస్తున్నారు. ఒక దశలో ఆయనను సకల శాఖల మంత్రిగా కూడా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున కూడా ప్రతి చిన్ని విషయంలో సజ్జల ప్రమేయం లేకుండా ఒక్క పని కూడా జరగని పరిస్థితి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్షలు చేస్తే... అది ఏ శాఖ అయినా పర్లేదు... ముందుగా రియాక్ట్ అయ్యేది సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. ఇక పార్టీకి సంబంధించి ఏ చిన్న పని జరగాలన్నా కూడా... అది సజ్జల వల్ల మాత్రమే సాధ్యం. అటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలైనా... ఇటు పార్టీ నేతల మధ్య వివాదమైనా.. విషయం ఏదైనా... సరే... సజ్జల ఓ మాట చెబితే చాలు... పని జరిగిపోతుంది. అసలు సజ్జల ప్రమేయం లేకుండా ఏ చిన్న పని కూడా ప్రస్తుత ప్రభుత్వంలో జరగటం లేదని అందరి నమ్మకం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇప్పుడు వరుణుడు పగబట్టినట్లు కనబడుతోంది. దాదాపు 15 రోజులుగా రాయలసీమ ప్రాంతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద భీభత్సం సృష్టించింది. వర్షాలు, వరదలతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. అటు ప్రభుత్వ సహాయక చర్యలపై ఇప్పటికే పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. పరామర్శకు వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పుడు ఇదే నిరసన సెగ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జలకు కూడా తగిలింది. సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సజ్జలను వరద బాధితులు నిలదీశారు. ప్రభుత్వ సాయం ఏ మాత్రం అందడం లేదని సజ్జలను అడ్డుకున్నారు. రాజంపేట నియోజకవర్గం పులపుత్తూరు గ్రామస్థులు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యటనను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. వరదల్లో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: