ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ఎన్నో కార్యక్రమాలకు రాష్ట్ర హైకోర్టు బ్రేకులు వేసింది. ఇదే విషయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం.. ఏకంగా న్యాయ వ్యవస్థను తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా.. ఏకంగా 151 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీలో తనకు ఎదురులేనట్లుగా వ్యవహరించారు కూడా. రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధించాలంటే... అది కేవలం పరిపాలన వికేంద్రీకరణ వల్లే సాధ్యమన్నారు. అందుకనే రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలని ప్రకటించారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాన్ని ప్రకటించారు. ప్రకటించిన వెంటనే... విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు పనులు కూడా స్టార్ట్ చేశారు. కార్యాలయాల ఏర్పాటుకు కూడా ప్రణాళిక రూపొందించారు.

అయితే ప్రభుత్వం చేసిన ప్రకటనకు హైకోర్టు బ్రేకులు వేసింది. మూడు రాజధానుల ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమరావతి ప్రాంత రైతులు.... హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో చేసేది లేక... ప్రభుత్వమే వెనక్కి తగ్గింది. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును అసెంబ్లీలోనే రద్దు చేసింది ప్రభుత్వం. కానీ కార్యాలయాలను మాత్రం విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఆ ప్రక్రియకు కూడా ప్రస్తుతం హైకోర్టు బ్రేక్ కొట్టింది. మూడు రాజధానుల బిల్లుల్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో, మండలిలో ఆమోదం పొందిన బిల్లులు ప్రస్తుతం గవర్నర్ కార్యాలయంలో ఉన్నాయి. వీటికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉన్న స్టే మరి కొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో ప్రభుత్వానికి బ్రేక్ పడినట్లుగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: