కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారని హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. గుట్కా, పాన్‌ మసాలాపై నిషేధాన్ని న్యాయస్థానం సమర్థించిన‌ది. గుట్కా నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన 160 పిటిషన్ల‌ను  కొట్టేసింది. ఏటా రూ.350 కోట్లు..  ఈ అంకెలు చాల‌ని తెలంగాణ రాజధానిలో గుట్కా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఎలా సాగుతున్నాయో చెప్ప డానికి.. ఇది  చూడటానికి చాలా చిన్న వ్యాపారంగానే కనిపిస్తున్నా తెరవెనుక పెద్ద మాఫియా, కర్ణాటక గుట్కా డాన్‌లు ఉన్నారు.

ఆరోగ్యానికి హానికరమంటూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా.. రాజధాని నగరం అయిన హైద‌రాబాద్‌లో గల్లీగల్లీలో దొరుకుతోంది.  ఢిల్లీ, యూపీ కర్ణాటక రాష్ట్రాల నుంచి గుట్కా సంచులు లారీల‌లో వస్తుండగా.. ఇక్కడి నుంచి టన్నుల్లో ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు వెళ్తున్నాయి. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్లలో 90 శాతం పాన్ డ‌బ్బాలు, రిటైల్‌ దుకాణాల్లో గుట్కా అమ్ముతున్నారని పోలీసులకు ముందే తెలుసు కానీ.. ఎవరైనా ఫిర్యాదుచేస్తేనే  కేసులు న‌మోదు చేస్తున్నారు. గుర్తుకొచ్చిప్పుడు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి తనిఖీలు, దాడులు మాత్రమే కొన‌సాగిస్తున్నారు.  కొందరు పోలీస్‌ అధికారులకు ఈ మాఫియాతో సంబంధాలుండడంతోనే విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా  బేగంబజార్‌, కాటేదాన్‌, సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలు గుట్కా తయారీ, నిల్వల కేంద్రాలుగా మారాయి.  ఇక్క‌డ యువకులు, మైనర్లు గుట్కాకు మహారాజ పోషకులుగా మారారు.

ఈ ప్యాకెట్లు అమ్మితే వందశాతం లాభం వస్తుండడంతో సిగరెట్ల కంటే వీటి విక్రయాలపైనే పాన్‌డబ్బాలు, రిటైల్‌, చిల్లరవ్యాపారులు ఎక్కువ ఆసక్తి  క‌న‌బ‌రుస్తున్నారు. రోజుకు వంద ప్యాకెట్లు విక్రయిస్తే రూ.500లు ఆదాయం వ‌స్తున్న‌ది.  భారీగా డిమాండ్‌ ఉన్నప్పుడు ఒక్కో ప్యాకెట్‌ను రూ.15లకు కూడా అమ్ముతున్నారు.  హైదరాబాద్‌ శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా తయారీ కొనసాగుతోంది. రోజుకు రూ.20లక్షల నుంచి రూ.50లక్షల విలువైన సరకు త‌యార‌వుతున్న‌ది. పాతబస్తీ, కాటేదాన్‌ పారిశ్రామిక వాడలోని పాతగోదాములు, కర్మాగారాల్లో యంత్రాల సాయంతో తయారు చేస్తు ఉన్నారు. ప‌లువురు ఇత‌ర‌ రాష్ట్రాలకు చెందిన కూలీలను తీసుకొస్తున్నారు.  ముడిసరుకు తీసుకొచ్చి వేర్వేరు బ్రాండ్ల పేర్లతో గుట్కాను తయారు చేసి హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు.

ఇక్కడ తయారైన తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎగుమతి  చేస్తున్నారు.  మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, పుణె, నాందేడ్‌, కర్ణాటకలోని బెంగళూరు, బీదర్‌, కలబురిగి, రాజస్థాన్‌లోని జైపూర్‌, యూపీలోని ఆగ్రా, ఢిల్లీల్లోని అంతరాష్ట్ర గుట్కా వ్యాపారులతో హైదరాబాద్‌ గుట్కా వ్యాపారులకు ఎప్ప‌టి నుంచో సంబంధాలు ఉన్నాయి. సరిహద్దులు, చెక్‌పోస్టులలో పట్టుబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడేండ్ల‌ క్రితం టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఓటీ, నల్గొండ జిల్లా పోలీసులు వేర్వేరుగా దాడులు చేప‌డితే.. మూడు నెలల్లో రూ.8 కోట్ల గుట్కా  రూ.2 కోట్ల ముడిస‌రుకును స్వాధీనం చేసుకున్నారు. పాన్‌మసాలాలపై నిషేధం లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు, తంబాకు ప్యాకెట్లను తయారు చేయించి, పాన్‌ మసాలాలతో కలిపి  వీటిని విక్రయిస్తున్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో గుట్కాపై నిషేధం లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు అక్కడి నుంచి పెద్ద ఎత్తున తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: