ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ ప్రాంతం వరద తాకిడికి అల్లాడిపోయింది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు భారీ నష్టం జరిగింది. ఇప్పటికీ ప్రజలు కష్టాల్లోనే ఉన్నారు. ఇళ్లు పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఊళ్లకు ఊళ్లు వరద తాకిడికి అల్లాడిపోయాయి. ఒక్క కడప జిల్లాలోనే ఇప్పటి వరకు 40 మంది పైగా మృతి చెందారు. వేల ఎకరాల్లో పంట నీటి పాలైంది. వేల మంది నిరాశ్రయులయ్యారు. పంట నష్టం భారీగా ఉంది. ఇక రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. రైల్వే ట్రాకులు కూడా కోతకు గురయ్యాయి. ఇప్పటికే  వరద నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. అయితే విపక్షాలు మాత్రం ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వరద బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శిస్తున్నాయి.

ఈ రోజు రాజ్యసభలో కేంద్రం ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర విమర్శలు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, తుపానుల కారణంగా రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేశాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభలో వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని, కుందు, చెయ్యేరు, గుండ్లకమ్మ, స్వర్ణముఖి నదులు వరద నీటితో పోటెత్తాయి. సమీప గ్రామాలు పూర్తిగా నీట మునిగినట్లు తెలిపారు. ఇక వరద దెబ్బకు అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు తెగిపోయాయన్నారు. టెంపుల్ సిటీ తిరుపతి పట్టణంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని... నగరం ఇప్పటికి కోలుకేలేదన్నారు విజయసాయి రెడ్డి. ఇప్పటికే వరద కారణంగా దాదాపు 6 వేల కోట్ల రూపాయల పైగా నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశామన్నారు. తక్షణ సాయం కింద కేంద్రం వెంటనే వెయ్యి కోట్లు విడుదల చేయాలని వైసీపీ ఎంపీ డిమాండ్ చేశారు. వరదలు తగ్గి దాదాపు వారం రోజులు అవుతున్నా కూడా... కేంద్రం మాత్రం ఇప్పటి వరకు కనీస సాయం చేయలేదన్నారు వైసీపీ ఎంపీ.


మరింత సమాచారం తెలుసుకోండి: