ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై మరోసారి కేంద్రం తేల్చేసింది. స్పెషల్ స్టేటస్‌పై గత ప్రభుత్వం యూ టర్న్‌లు తీసుకుందని తీవ్ర ఆరోపణలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తాము అధికారంలోకి వచ్చిన వెంటనే... కేంద్రంతో పోరాటం చేసి మరీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో గట్టిగా నిలదీయలేమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి ఢిల్లీ పర్యటనలోనే తేల్చేశారు. అయినా సరే తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కానీ కేంద్రం మాత్రం... ఛాన్స్ లేదని అప్పుడే తెల్చేసింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది కేంద్రం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం లోని హామీలపై తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అంశమన్నారు. ఇదే విషయాన్ని గతంలో కూడా వెల్లడించామన్నారు. అయితే విభజన చట్టంలోని హామీలను అమలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలతో చర్చలు జరుపుతున్నామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్. తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తోందన్నారు. అలాగే 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ప్రత్యేక హోదా అంశం ఎప్పుడో ముగిసిపోయిందన్నారు. అందుకోసమే ఏపీకి ప్రత్యేక సాయంగా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలిపారు. అందుకోసమే 2019 - 2020 వరకు ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న విదేశీ రుణాల అసలు, వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తున్నట్లు తన సమాధానంలో నిత్యానంద రాయ్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: