భారత్ లో పిల్లల టీకాలు త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. వీలైతే ఆరు నెలల్లోనే అందుబాటులోకి వస్తుందని సీరం సంస్థ ప్రకటిస్తోంది. ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయని పేర్కొంది. కోవో వాక్స్ తో రెండేళ్ల లోపు పిల్లలకు టీకాలు వేస్తామని తెలిపింది. అమెరికాలో నోవో వాక్స్ పేరిట పిలుస్తున్న ఈ వ్యాక్సిన్ ను.. కోవో వాక్స్ పేరుతో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది. దేశంలో అత్యవసర వినియోగానికి కోవో వాక్స్ దరఖాస్తు చేయగా. డీజీసీఐ మరింత సమాచారం కోరింది.

మన దేశంలోని చిన్నారులకు టీకాలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కొవిడ్ టాక్స్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎస్ కే అరోడా అన్నారు. 18ఏళ్ల లోపు ఉన్న 44కోట్ల మందికి టీకాలు వేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. దీన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారులకు తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. జైకోవ్-డీ, కొవాగ్జిన్ కార్బివ్యాక్స్ టీకాలు ఇస్తామన్నారు. అందరికీ సరిపడా డోసులు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు.

మరోవైపు కొత్త రకం కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన ఆఫ్రికన్ దేశాలకు భారత్ అండగా ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. మెడిసిన్, టెస్ట్ కిట్లు, చేతి గ్లౌవ్స్, పీపీఈ కిట్లు, అవసరమైతే ఇతర వైద్య పరికరాలను సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఎమ్ఈఏ వెల్లడించింది. ప్రమాదకర వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ఆఫ్రికన్ దేశాలపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్న కారణంగా ఆ దేశాలకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది.

ఇక ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్ లో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ రాజ్యసభలో చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగానే ఉన్నామనీ.. విదేశాల నుంచి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని రాష్ట్రాలకు లేఖ రాశామన్నారు.  






మరింత సమాచారం తెలుసుకోండి: