ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. అయితే ఇటీవలే ఆయన వరదల ఉధృతి తెలుసుకునేందుకు హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన వరద వచ్చిన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రోడ్డు మార్గంలో పర్యటించనున్నారు. దీంతో టీడీపీ నేతలు ఇదంతా తమవల్లనే సాధ్యమైందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. టీడీపీ అధినేత వరుసగా వరద వచ్చిన ప్రాంతాల్లో పర్యటించారని, అందుకోసమే జగన్ కూడా ఏరియల్ సర్వే వదలిపెట్టి.. ఇలా నేలమీదకు దిగుతున్నాడని అంటున్నారు. గాలిలో సర్వేలు చేస్తే సరిపోదని చంద్రబాబు విమర్శించారని, అందుకే సీఎం జగన్ వెనక్కు తగ్గి ఇలా పర్యటన పెట్టుకున్నారంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

ఏపీలో ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలకు జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. నవంబర్ నెల మొత్తం దాదాపుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇలా ఎడతెరిపి లేని వర్షాలతో ఈ మూడు జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలావరకూ ఇళ్లన్నీ నీట మునిగాయి. పంటనష్టం కూడా భారీగానే జరిగింది. రోడ్లన్నీ కాలువలుగా మారిపోయాయి. ఇళ్లలో వస్తువులన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి. చరిత్రలో ఇంతవరకూ చూడని విపత్తు జరిగిందంటూ ఈ మూడు జిల్లాల ప్రజలు చెబుతున్నారు. కనీసం తమను పట్టించుకోలేదంటూ బాధితులు చాలా ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా తమను నట్టేట ముంచేశారని మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఏరియల్ సర్వేలో నేరుగా వరద బాధితులను కలిసే వీలు లేనప్పటికీ.. ఇప్పుడు సీఎం జగన్ నేరుగా పర్యటిస్తుండటంతో వరద బాధితులు తమ కష్టాలను చెప్పుకొనే వీలు దొరికింది. ఇప్పటికే వరద బాధితులకు రెండు వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది. ప్రతీ రేషన్ కార్డుదారుడికి ప్రభుత్వం నిత్యావసర సరుకులను అందజేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 2, 3 తేదీల్లో మూడు జిల్లాల్లో సీఎం పర్యటన ఖరారైంది. జగన్ పర్యటన ఖరారు కాగానే టీడీపీ నేతలు మాత్రం ఇదంతా తమ విజయంగా చెప్పుకోవడం కొసమెరుపు. సీఎం జగన్ ఏరియల్ సర్వే తర్వాత ఎక్కడా, ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు, వరద వ్యవహారంపై తన సందేశం ఇవ్వలేదు. ఇప్పుడు నేరుగా ఆయా జిల్లాల్లో పర్యటించే సీఎం ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: