జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ వివాదానికి కారణం అవుతున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. ఈ పథకానికి సంబంధించి అధికారుల ప్రవర్తన జనానికి చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. తాజాగా ఓటీఎస్ వసూళ్ల కోసం అధికారులు బెదిరింపులకు కూడా దిగడంతో ప్రభుత్వ పరువు గంగలో కలిసిపోతోంది. దీనికి తోడు శ్రీకాకుళం జిల్లాలో ఓ పంచాయితీ కార్యదర్శి ఓ అడుగు ముందుకేసి.. పెన్షన్లు కూడా ఆపేస్తామని ఆదేశాలివ్వడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పంచాయితీ కార్యదర్శి ఏకంగా సర్క్యులర్ కూడా జారీ చేయడంతో అధికార యంత్రాంగం పక్కాగా ఇరుక్కుపోయింది.

ఇటీవల ఓటీఎస్ వసూళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పథకం అమలు స్వచ్ఛందమని ప్రకటిస్తూనే మరోవైపు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో అధికారులు అత్యుత్సాహంతో పని చేస్తున్నారు. సంపూర్ణ గృహ హక్కు కావాలంటే నగదు కట్టాలని, లబ్ధిదారుల ఇళ్లవద్దకు వెళ్తున్నారు. పంచాయితీ కార్యదర్శులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, వాలంటీర్లు, వీఆర్వోలు నేరుగా లబ్దిదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే వాలంటీర్లు మరీ శృతి మించి ప్రవర్తిస్తున్నారు. ఏకాంగా రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచారం చేస్తున్నారు. ఓటీఎస్ డబ్బు చెల్లించకపోతే, ఆ తరువాత ప్రభుత్వ పథకాలు ఏవీ రావంటూ భయపెడుతున్నారు.

ఇలా బలవంతంగా కింది స్థాయి సిబ్బంది ఓటీఎస్ పధకం డబ్బులు వసూలు చేస్తున్నారని ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దిద్దుబాటు చర్యలను కూడా ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఓటీఎస్ కింద కచ్చితంగా నగదు చెల్లించాలనే నిబంధనలు ఏమీ లేవన్నారు. ప్రజలు స్వచ్ఛందంగానే ఈ పధకంలో భాగస్వాములు కావచ్చని చెప్పారు. అయితే అధికారుల కారణంగా ఇప్పటికే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. ప్రతిపక్షాల దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో.. టీడీపీ నేత లోకేష్ కూడా ఈ వసూళ్లపై ఫైర్ అయ్యారు. అధికారుల తీరు చూస్తుంటే కాల్ మనీ మాఫియా వేధింపులు గుర్తుకు వస్తున్నాయని మండిపడ్డారు. మొత్తమ్మీద పెన్షన్ ఆపేస్తామంటూ సర్క్యులర్ ఇచ్చిన సదరు పంచాయతి కార్యదర్శిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. మరోసారి అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు ప్రతిపక్షం మాత్రం ఓటీఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: