ఒమిక్రాన్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇది. ఇది మరోసారి కరోనాను తీవ్రస్థాయికి తీసుకెళ్తుందేమో అన్న ఆందోళనలు అంతటా కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒమిక్రాన్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తోంది. ఇలాంటి సమయంలో ఇండియా కూడా అప్రమత్తమైంది. కేంద్రం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే అన్ని సామూహిక కార్యక్రమాలపైనా, వేడుకలపైనా నిషేధం విధించాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయ.


ఇలాంటి సమయంలో ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే.. ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్‌ను కానీ తట్టుకునే శక్తి చాలా మంది ఇండియన్లకు ఉందట. ఈ ఒమిక్రాన్ గురించి ఎవరూ భయాందోళనలు చెందనక్కర్లేదట. ఈ విషయాన్ని సుప్రసిద్ధ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ చెబుతున్నారు. ఒమిక్రాన్ గురించి అంతగా భయపడాల్సిందేమీ లేదని ఆయన భరోసా ఇస్తున్నారు.  కానీ.. కరోనా విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దని.. ఇంకా మాస్కులు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా చేయాలని ఆయన సూచిస్తున్నారు.


ఇంతకీ.. ఈ షాహిద్ జమీల్‌ ఎవరు అంటారా.. ఆయన ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జినోమిక్స్‌ కన్సార్టియా సలహా సంఘానికి గతంలో ఆయన అధ్యక్షుడు. ఇండియాలో కొవిడ్‌ రెండో దశలో డెల్టా వేరియంట్‌ చాలా ఎక్కువ మందికి వచ్చిందన్న జమీల్.. 67 శాతం మంది భారతీయుల్లో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని జాతీయ సీరో సర్వే కూడా ధ్రువీకరించిందని.. దీన్నిబట్టి చూస్తే.. 94 కోట్ల మందికి పైగా ఇండియన్లలో యాంటీబాడీలు ఉన్నట్టు తెలుస్తోందని జమీల్ తెలిపారు.


డెల్టా వేరియంట్ విజృంభించే నాటికి దేశంలో వ్యాక్సిన్లు వేసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని.. అందువల్లే కొవిడ్‌ సోకి ఎక్కువ మందిలో యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయని జమీల్ వివరించారు. అందువల్ల చాలా మంది ఇండియన్లు ఒమిక్రాన్‌ను తేలికగా జయిస్తారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: