దళిత బంధు.. కేసీఆర్.. కొన్నాళ్ల క్రితం చాలా అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమం.. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు అందిచాలని.. దీని ద్వారా ప్రతి దళిత కుటుంబం ఏదో ఒక వ్యాపారమో.. ఉపాధి మార్గమో చూసుకుని వృద్ధి లోకి రావాలని కేసీఆర్ భావించారు. దీన్ని హుజూరాబాద్‌లో ప్రారంభించిన కేసీఆర్.. ఆ తర్వాత మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తామని అన్నారు. ఈ నాలుగు నియోజక వర్గాల్లో పూర్తిగా అమలు చేస్తామని.. ఆ తర్వాత ప్రతి నియోజక వర్గంలో ముందుగా 100 మంది దళితులకు ఈ దళిత బంధు అమలు చేస్తామని అన్నారు.


అయితే.. హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ ఈ దళిత బంధు తీసుకొచ్చారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీన్ని తిప్పికొట్టినే కేసీఆర్.. తన గొంతులో ప్రాణం ఉండగా దళిత బంధు ఆగబోదని స్పష్టం చేశారు. దీంతో ఇక ఈ పథకం ఆగదని.. తెలంగాణలో దళితుల జీవితాలు బాగు పడినట్టేనని ఆ వర్గానికి చెందిన నాయకులు, ప్రజలు భావించారు. అయితే.. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం అమలు చేసినా సరే.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను అక్కడి జనం గెలిపించలేదు.


విచిత్రం ఏంటంటే.. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్ నోట దళిత బంధు పథకం గురించిన ముచ్చట్లేమీ వినిపించడం లేదు. హుజూరాబాద్ ఫలితం వచ్చిన తర్వాత ఆయన ఈ దళిత బంధు పథకం గురించిన సమీక్షలు కానీ... ప్రణాళిక కానీ.. ఏమీ ప్రకటించలేదు.. మరి ఇప్పుడు తెలంగాణలో దళిత బంధు పథకం అమలు కొనసాగుతుందా.. లేక ఆగినట్టేనా అన్న అనుమానం దళిత వర్గాల్లో వ్యక్తమవుతోంది.


దళిత బంధు కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసం కాదన్న కేసీఆర్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకూ దృష్టిలో పెట్టుకుని ఈ పథకం తెచ్చారని విమర్శకులు భావించారు. మరి రెండేళ్లలోపే తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ దళిత బంధు పథకం భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: