హ్యాట్రిక్ విజయంతో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు మమతా బెనర్జీ. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని ఇప్పటికే మమతా బలంగా చెప్పేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ నేతలు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ దీదీని ఓడించలేకపోయారు. చివరికి బెంగాల్ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ అగ్రనేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. బహిరంగ సభలు నిర్వహించారు. కానీ.... చివరికి మూడంకెల సీట్లు కూడా సాధించలేక పోయారు కమలం పార్టీ నేతలు. వరుసగా మూడోసారి విజయం సాధించిన దీదీ.. ప్రస్తుతం దేశ రాజకీయాలపై దృష్టి సారించారు. మరో మూడు నెలల్లో జరగనున్న గోవా, మణిపూర్ ఎన్నికలపై ఇప్పటికే దీదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ సహకారంతో దీదీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం దీదీ కన్ను తెలుగు రాష్ట్రాలపై పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. వైసీపీ గెలుపుకోసం దాదాపు రెండేళ్ల పాటు పీకే టీమ్ పని చేసింది కూడా. ఆ తర్వాత బెంగాల్‌లో దీదీ గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా శ్రమించారు. తాజాగా మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీ నేతలు టీఎంసీలో చేరేందుకు పీకే తెర వెనుక కీలక పాత్ర పోషించారు. బీజేపీకి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న మమతా.. అందులో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే ఏపీలో కూడా తన పార్టీని విస్తరించేందుకు ప్రశాంత్ కిషోర్ సాయంతో అసంతృప్త నేతల జాబితాను సిద్ధం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తాము బలమైన శక్తిగా ఎదిగేందుకు మమతా అడుగులు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: