మమతా బెనర్జీ.... ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఒక రేంజ్‌లో ఉన్నారు. హ్యాట్రిక్ విజయాలతో వరుసగా మూడో సారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై ఒంటికాలుతో దూకుతున్న మమతా బెనర్జీ... బెంగాల్ ఎన్నికల్లో కమలం పార్టీని చావు దెబ్బ కొట్టారు. విజయం కోసం ఎన్నో పాట్లు పడిన కాషాయ పార్టీ పెద్దలకు ముచ్చెమటలు పట్టించారు దీదీ. తృణమూల్ సర్కార్‌ను పడగొడతామని బల్లగుద్ది మరీ చెప్పిన బీజేపీ నేతలను... చివరికి మూడంకెల సీట్లు కూడా దక్కకుండా చేశారు. అదే ఊపులో ఇప్పుడు దేశ రాజకీయాలపై కన్నేశారు కూడా. ఇప్పటికే మేఘాలయాలో అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు మమతా

ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాలపై కూడా మమతా బెనర్జీ దృష్టి సారించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారు దీదీ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అసంతృప్తి నేతలతో పీకే టీమ్ చర్చలు జరుపుతోంది. తెలంగాణలో అటు అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా పీకే టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. అలాగే ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలను కూడా కలిసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పార్టీల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఏపీలో తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలున్నాయి. అటు తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఎస్‌పీలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీని తెలుగు ప్రజలు ఆదరించే పరిస్థితి కొద్దిగా కష్టమే. ముఖ్యంగా భాషాపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎంతోకాలంగా రాజకీయాలు చేస్తున్న పార్టీల పరిస్థితి ఏపీలో దయనీయంగా ఉంది. ప్రస్తుతం జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక గత ఎన్నికల్లో బీజేపీకి కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్లు దక్కలేదు. ఇక దళితుల పార్టీగా ఉన్న బీఎస్పీ కూడా సీట్లు సాధించలేక పోతుంది. పెద్ద పార్టీల పరిస్థితే ఇలా ఉంటే... ఇక టీఎంసీకి అవకాశం కష్టమే అంటున్నారు విమర్శకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: