ప్రభుత్వం కృతనిశ్చయంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరిగిందని తమకు రావాల్సిన దాన్యం డబ్బులు తమ అకౌంట్లో తక్కువ జమ అవుతుందని రైతులు పదేపదే అధికారులను ఆశ్రయించారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించారు. డబ్బులు తక్కువ జమ అవుతున్నాయని అధికారులకు మొరపెట్టుకుంటే పట్టించుకున్న పాపాన పోలేదు.పైగా మండల స్థాయిలో ఉన్న అధికారులు రైతుల పట్ల తిట్లపురాణం మొదలుపెట్టారు.

మాకు సంబంధించింది కాదు, మా పరిధిలో లేదు అంటూ కాలం వెళ్లదీశారు. సెంటర్ నిర్వాహకులు కిలోల కొద్ది ధాన్యాన్ని తరుగు పేరుతో తీసి ఆ ధాన్యాన్ని బస్తాలలో నింపుకొని సభ్యుల పేరు మీద కాంటాలు పెట్టుకొని తమ అకౌంట్లో డబ్బులు పడే  విధంగా మిల్లర్లతో ములాకత్ ఏర్పరచుకొని లక్షలు కాజేశారు. మొన్నటి వరకు కూడా రైతులు అధికారుల ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగి వేసారి వాళ్ల దుంపతెగ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. రైతులను మోసం చేసిన నిర్వాహకులు, అధికారులు ఎప్పుడూ బాగుపడరని శాపనార్థాలు పెట్టారు.అటు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ యాజమాన్యాలతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై రైతులను దగా చేస్తున్నారని విమర్శలు వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలులో డైరెక్టర్ లే లక్షల్లో అవినీతి చేశారని ఆరోపణలు వచ్చినా  తూతూ మంత్రంగా విచారణ జరిపి గాలికి వదిలేశారు. అటు ఐకేపీ ఇటు పీసిఎస్ కొనుగోలు కేంద్రాలు రైతులను మోసం చేయడంలో దొందూదొందే అది రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని అధికారులు నీరుగారుస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక మిల్లర్ యాజమాన్యాల గురించి చెప్పనక్కర్లేదు. రోజుల తరబడి లారీలను అన్లోడ్ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.

అది కాకుండా ధాన్యంలో నాణ్యత లోపించిందని కిలోల కొద్ది తరుగు పోతుందని రైతులను మోసం చేశారు. వాస్తవంగా రైతేరాజు అని చెప్పుకునే ప్రభుత్వం మోసాలకు గురి అవుతున్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయకుండా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ  కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా  ఇటువంటి మోసాలపై ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: