కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం భవిష్యత్ ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీపై జెండా ఎగుర వేసేందుకు అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో రెండు పార్టీలకు సమానంగా కౌన్సిలర్లు గెలుపొందారు. అయితే అనూహ్యంగా స్వతంత్ర్య అభ్యర్థి టీడీపీలో చేరడంతో... ఆ పార్టీ బలం 15కు చేరుకుంది. ఇదే సమయంలో ఎక్స్ అఫీషియో ఓటుతో ఎంపీ కేశినేని నాని ముందుకు రావడంతో... కొండపల్లిని టీడీపీ గెలుచుకోవడం ఖాయమనిఅంతా భావించారు. కానీ నూతన మున్సిపాలిటీ మొదటి పాలకవర్గం ఎవరా అన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. పాలకవర్గ ఎన్నిక తీర్పు కోర్టు పరిధిలోకి వెళ్ళడంతో కోర్టు తీర్పు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తోందో అన్న ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే రెండు సార్లు తీర్పు వాయిదా పడగా మూడవ సారి అసలు ఆ వాయిదా వేశారా లేదా అన్నది కూడా  తెలియని పరిస్థితి.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటు చుట్టు తిరుగుతుండగా ఆయన ఓటు అసలు చెల్లుతుందా లేదా అన్న దానిపైనే విస్తృతంగా చర్చ నడుస్తోంది. టీడీపీ అధినాయకత్వం చెప్పినట్లు ఎంపి ఓటు పై స్పష్టమైన సమాచారం ఉంటే తీర్పు ఎందుకు వాయిదా పడుతుంది అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఇంకో వారం పాటు కొండపల్లి మున్సిపాలిటీ పై తీర్పు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారంతో సరిపెడతారా... లేక మరి కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే మరో వారం రోజుల పాటు వేచి చూడాల్సిందే. ఎక్స్ అఫీషియోగా విజయవాడ కార్పోరేషన్ పరిధిలో ఎంపీ కేశినేని నాని గతంలో ఓటు నమోదు చేసుకున్నారు. కానీ దానిని వినియోగించుకోలేదు. కొండపల్లి మునిసిపల్ అధికారులు ఓటు నమోదు చేసుకోవాలని అడిగినా ఆయన అందుకు విముఖత చూపారని... దీంతో ఎక్స్‌ అఫిషియోగా ఎంపీ ఓటు చెల్లదని అంటున్నారు వైసీపీ నేతలు. చూడాలి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: