ఒమిక్రాన్ వేరియంట్ గురించి వస్తున్న వార్తలు వింటుంటే.. ఇండియాలో మూడోవేవ్ తప్పదేమో అనిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇతర వేరియంట్ల కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తుందని వచ్చిన వార్తలు కలవరం కలిగిస్తున్నాయి. అయితే.. ఒమిక్రాన్ గురించి మరీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఇండియా వ్యాక్సినేషన్ జోరుగానే సాగుతోంది. ఇప్పటికే చాలా మంది రెండు డోసులు తీసుకున్నారు కూడా. ఇక మిగిలిన వారు కూడా ఇప్పడు  ఒమిక్రాన్ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.


అయితే.. ఒమిక్రాన్ వైరస్‌ను ఎదుర్కోవాలంటే.. కేవలం రెండు డోసులు టీకాలు తీసుకుని ఉంటే చాలదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందుకే రెండు డోసుల కరోనా టీకా తీసుకుని ఉన్నా.. మరో డోస్ట్ తీసుకోవడం మంచిదన్న వాదనలు వస్తున్నాయి. దీన్నే బూస్టర్ డోస్ అంటున్నారు. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో ఈ బూస్టర్ డోస్ విధానం అమల్లో ఉంది. దీన్ని ఇండియాలోనూ అనుమతించాలన్న వాదన బాగా వినిపిస్తోంది.


ఇప్పుడు టీకా ఉత్పత్తి సంస్థ సీరం సంస్థ కూడా కొవిషీల్డ్ టీకా బూస్టర్ డోసు పంపిణీ కోసం సిద్దమవుతోంది. ఈ మేరకు బూస్టర్ డోస్‌ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని భారతీయ ఔషధ నియంత్రణ సంస్థను అనుమతి అడుగుతోంది. ఇప్పటికే మన దేశంలో తగినంత మోతాదులో కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయని సీరం సంస్థ గుర్తు చేస్తోంది. ఒమిక్రాన్ సహా అనేక కొత్త వేరియంట్లు వెలుగుచూస్తున్న సమయంలో బూస్టర్‌ డోసు కోసం డిమాండ్ ఉందని ఆ సంస్థ డీసీజీఐకు పెట్టుకున్న విజ్ఞప్తిలో పేర్కొందట.


ఇప్పటికే లండన్‌లోని ఔషధ, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణా సంస్థ ఆస్ట్రాజెనెకా బూస్టర్ డోసుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రాజెనెకా ను ఇండియాలో కోవిషీల్డ్ పేరుతో సీరం ఉత్పత్తి చేస్తోంది. ఇండియా నుంచే కాదు.. ఇతర దేశాలలో కూడా బూస్టర్ డోసు కావాలని విజ్ఞప్తులు వస్తున్నాయట. అందుకే అనుమతి ఇవ్వండి బూస్టర్ డోస్ ఇచ్చేస్తామంటోంది సీరం సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: