ఏపీ సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించబోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నష్టపోయిన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగబోతోంది. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నేతల పర్యటనల్లో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇప్పుడు జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక నాయకులు కూడా హడావిడిపడుతున్నారు. ప్రజలనుంచి నిరసన ఎదురైతే ఎలా అని ఆందోళనలో ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఆందోళనకు దిగుతారో అని లోలోపల టెన్షన్ పడుతున్నారు వైసీపీ నేతలు.

మామూలుగా అయితే అందరూ సీఎం పర్యటన తమ ఏరియాలో పెట్టుకోమని పోటీపడుతుంటారు. అయితే ఈ వరదల నేపథ్యంలో వైసీపీ నేతలెవరూ సీఎం పర్యటనకు ఉత్సాహం చూపడం లేదట. ఒకవేళ అనుకోని రీతిలో సీఎంకు నిరసన సెగ తగిలితే ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని లోలోపల మదనపడిపోతున్నట్టు సమాచారం. దీనికి తోడు ఇటీవలే నెల్లూరు జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని కూడా నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయికి అడ్డుగా నిల్చొని.. ఓ రేంజ్ లో తిట్ల పురాణం అందుకున్నారు. చచ్చామో బ్రతికామో చూడటానికి వచ్చారా అంటూ తిట్టి పోశారు.

వరద బాధితులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించినప్పటికీ, ప్రజల్లో మాత్రం కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. కనీసం అధికారులు ముందస్తుగా వరద వస్తుందనే సమాచారం కూడా ఇవ్వలేదనే బాధ ప్రజల్లో కనిపిస్తోంది. లక్షల్లో నష్టపోతే కేవలం రెండు వేలు మాత్రమే పరిహారం అందించడంపైనా విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కడప జిల్లాల్లో ఈ రోజు సీఎం జగన్ పర్యటన ప్రారంభం అవుతుంది. అనంతరం తిరుపతి, నెల్లూరు నగరాల్లో పర్యటించి వరద బాధితులను జగన్ పరామర్శిస్తారు. వరద బాధితుల నుంచి నిరసనలు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: